Manipur Cops : మహిళలను అల్లరిమూకలకు అప్పగించింది పోలీసులే : సీబీఐ
Manipur Cops : మణిపూర్ గడ్డపై జరిగిన మారణహోమంతో ముడిపడిన సంచలన విషయం వెలుగుచూసింది.
- Author : Pasha
Date : 01-05-2024 - 7:42 IST
Published By : Hashtagu Telugu Desk
Manipur Cops : మణిపూర్ గడ్డపై జరిగిన మారణహోమంతో ముడిపడిన సంచలన విషయం వెలుగుచూసింది. మణిపూర్ హింసాకాండకు ఆజ్యం పోసేలా 2023 మే 4వ తేదీన కాంగ్‌పోక్పీ జిల్లాలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన కీలక విషయాలు సీబీఐ దర్యాప్తులో బయటపడ్డాయి. మైతేయి వర్గానికి చెందిన అల్లరి మూకల చేతికి చిక్కిన ఇద్దరు కుకీ – జోమి తెగ మహిళలు.. సంఘటనా స్థలానికి సమీపంలోని పోలీసు జీపు వద్దకు చేరుకొని రక్షణ కోరారు. అయితే పోలీసులు వారిని పట్టించుకోలేదు. ‘పోలీసు జీపు తాళాలు లేవు. మిమ్మల్ని రక్షించలేం’ అని అక్కడున్న పోలీసు సిబ్బంది చెప్పారు. సాయం చేయమని అర్థించిన ఓ మహిళను పోలీసులు(Manipur Cops) తోసివేశారు. అంతేకాదు.. ఆ ఇద్దరు కుకీ – జోమి తెగ మహిళలను మైతేయి అల్లరిమూకకు అప్పగించారు. ఈవివరాలను ఎవరో రాజకీయ నాయకులు చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ సీబీఐ తమ ఛార్జిషీటులో ప్రస్తావించింది.
We’re now on WhatsApp. Click to Join
స్వయంగా పోలీసులే ఆ ఇద్దరు కుకీ తెగ మహిళల్ని తమకు అప్పగించడంతో మైతేయి వర్గం అల్లరి మూకలు రెచ్చిపోయారని ఛార్జిషీట్‌లో సీబీఐ వెల్లడించింది. అనంతరం ఆ ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగించారని.. ఊరి శివారులో ఉన్న వరిపొలాల్లో వారిపై దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని సీబీఐ తెలిపింది. అలా సామూహిక అత్యాచారానికి గురైన ఇద్దరిలో ఒకరు కార్గిల్ యుద్ధవీరుడి భార్య కూడా ఉండటం గమనార్హం. ఇక అల్లరిమూకల చేతికి చిక్కిన మూడో మహిళ ఈ అఘాయిత్యం నుంచి కొంచెంలో తప్పించుకొంది. ఈ ఘటన మే 4న జరగగా .. రెండు నెలల తర్వాత జులై నెలలో దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ అకృత్యంలో భాగమైన ఆరుగురు నిందితులతోపాటు ఓ బాల నేరస్థుడిపైనా అసోంలోని గువహటిలో ఉన్న సీబీఐ ప్రత్యేక జడ్జి కోర్టులో గతేడాది అక్టోబరు 16న ఛార్జిషీటు దాఖలు చేశారు.మైతేయి తెగకు చెందిన అల్లరిమూకల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన కుకీ తెగకు చెందిన తండ్రీకొడుకుల మృతదేహాలను ఊరి సమీపంలోని నీరు లేని నదిలోకి విసిరేసినట్లు సీబీఐ దర్యాప్తులో గుర్తించారు.