Modi Govt: ఎన్నికల వ్యవస్థలో మోదీ కీలక మార్పులు.. ఐదు రాష్ట్రాల్లో గెలిచేందుకేనా?
ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన నాలుగు కీలక నిర్ణయాలను మోదీ కేబినెట్ ఆమోదించింది. నకిలీ ఓట్లకు చెక్ పెట్టడంతో పాటు.
- Author : Siddartha Kallepelly
Date : 15-12-2021 - 10:48 IST
Published By : Hashtagu Telugu Desk
ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన నాలుగు కీలక నిర్ణయాలను మోదీ కేబినెట్ ఆమోదించింది. నకిలీ ఓట్లకు చెక్ పెట్టడంతో పాటు.
ఎన్నికల వ్యవస్థను మరింత పగడ్బందీగా చేయడానికి ఎన్నికల కమీషన్ చేసిన సిఫార్సులకు అనుగుణంగా రూపొందించిన బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఓటర్ ఐడీకి ఆధార్ లింక్ చేయాలనే నిర్ణయాన్ని కేబినెట్ తీసుకుంది. నకిలీ ఓట్లు నివారించడానికి ఓటరు ఐడీకి ఆధార్ కార్డును లింక్ అవసరమని ఈసీ గతంలో పంపిన ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ నేడు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. దాంతో ఓటర్లందరూ తమ ఓటర్ ఐడీకార్డులకు ఆధార్ కార్డును అనుసంధానం చేయాల్సి ఉంటుంది.
Also Read: పాపం బాబు.! బాలయ్య కన్నీళ్ల కథ!!
కొత్త ఓటర్ల నమోదుకు ఏడాదికి ఒకసారి మాత్రమే అవకాశం ఉంది. తాజాగా వచ్చిన బిల్లు ద్వారా ఇకపై ఏడాదికి నాలుగు సార్లు కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకునే వీలుంటుందని కేబినెట్ తెలిపింది. 2022 జనవరి 1 నుండి 18 సంవత్సరాలు నిండిన వారందరూ నాలుగు వేర్వేరు కటాఫ్ తేదీలతో సంవత్సరానికి నాలుగు సార్లు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.
పోస్టల్ బ్యాలెట్ వాడుకునే సదుపాయం ఇన్నిరోజులు సర్వీసులో ఉన్న పురుష ఓటరు భార్యకు మాత్రమే అందుబాటులో ఉండేది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇకనుండి ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసే మహిళ యొక్క భర్త కూడా పోస్టల్ బ్యాలెట్ వేసే వెసులుబాటు ఇవ్వనున్నారు.
ఎన్నికల సంఘానికి విస్తృత అధికారాలు కల్పించేలా ఉండే చట్టానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.ఎన్నికల సమయంలో ఎన్నికల నిర్వహణ కోసం దేశంలోని ఏ ప్రాంతాన్నైనా స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన అధికారాలను ఈసీకి కల్పించేలా మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Also Read: ఔను! వాళ్లిద్దరూ చెరోదారి!!
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలున్న సందర్భంలో మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చర్చకు దారితీస్తోంది.
మొన్న పలు రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ అట్టర్ ప్లాప్ అవ్వడంతోనే రానున్న ఎన్నికలకోసం బీజేపీ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ కొత్త నిర్ణయాలు మోదీకి కలిసొస్తాయా? బ్యాక్ ఫైర్ అవుతాయా వేచి చూడాలి.