Rahul Gandhi – Varun Gandhi : వరుణ్ గాంధీతో రాహుల్ గాంధీ భేటీ.. అందుకేనా ?
Rahul Gandhi - Varun Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చాకచక్యంగా పావులు కదుపుతున్నారు.
- Author : Pasha
Date : 08-11-2023 - 12:00 IST
Published By : Hashtagu Telugu Desk
Rahul Gandhi – Varun Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చాకచక్యంగా పావులు కదుపుతున్నారు. మేనకాగాంధీ ఫ్యామిలీని కూడా కాంగ్రెస్‌కు చేరువ చేసుకునే ప్రయత్నాల్లో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల నాటికి మేనకాగాంధీ ఫ్యామిలీ కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చేస్తే.. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ స్ట్రాంగ్ అవుతుందని రాహుల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని కేదార్‌నాథ్ ఆలయం వేదికగా బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కలిసినట్లు తెలుస్తోంది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇద్దరూ కొద్దిసేపు సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ సమావేశం సాధారణమైనదే అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నెలల క్రితం మేనకాగాంధీకి వ్యతిరేకంగా బీజేపీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో వరుణ్, రాహుల్ సమావేశం కీలకమైనదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో మేనకాగాంధీ, సోనియాగాంధీ ఫ్యామిలీలు మళ్లీ ఏకమయ్యేందుకు కేదార్‌నాథ్ ఆలయమే వేదికగా మారి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మేనకాగాంధీ కుటుంబం ప్రస్తుతం బీజేపీలో ఉన్న సంగతి తెలిసిందే. మేనకాగాంధీ కుమారుడు వరుణ్ గాంధీ కూడా కమల దళంలోనే ఉన్నారు. అయితే ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ అయినప్పటి నుంచి మేనకాగాంధీ ఫ్యామిలీకి బీజేపీలో అంతగా ప్రయారిటీ లభించడం లేదు. ఈ గ్యాప్ మరింత పెరిగి ఇటీవల అమేథీలోని సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్ లైసెన్స్‌ను యూపీ ఆరోగ్య శాఖ సస్పెండ్ చేసిింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వరుణ్ గాంధీ.. ఆస్పత్రి లైసెన్సును సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను పునస్సమీక్షించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్‌కు లేఖ రాశారు. ఆస్పత్రి సేవల్లో లోపాలు ఉంటే సరిచేసుకునే సమయం ఇవ్వాలే తప్ప.. ఈవిధంగా లైసెన్సు రద్దు చేస్తే దానిపై ఆధారపడిన వందలాది మందికి ఉపాధి దూరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అలహాబాద్ హైకోర్టును వరుణ్ గాంధీ ఆశ్రయించగా.. లైసెన్సును రద్దు చేస్తూ యూపీ ఆరోగ్య శాఖ ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. ఈ ఘటనతో బీజేపీకి, మేనకాగాంధీ ఫ్యామిలీకి మధ్య గ్యాప్ పెరిగిందనేది(Rahul Gandhi – Varun Gandhi) విస్పష్టం.