PK Arrest : నిరాహార దీక్ష చేస్తున్న పీకే అరెస్ట్.. కోర్టుకు వెళ్తానన్న ప్రశాంత్ కిశోర్
పీకే(PK Arrest)తో పాటు నిరసన తెలుపుతున్న వారందరినీ అరెస్టు చేశారు.
- By Pasha Published Date - 08:57 AM, Mon - 6 January 25

PK Arrest : జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్‌ను పాట్నా పోలీసులు అరెస్టు చేశారు. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) పరీక్ష పేపర్ లీక్‌కు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జనవరి 2 నుంచి పాట్నాలో ఆయన ఆమరణ నిరాహార దీక్షచేస్తున్నారు. పీకే దీక్ష చేస్తున్న గాంధీ మైదాన్‌కు ఇవాళ తెల్లవారుజామున పోలీసులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. పీకే(PK Arrest)తో పాటు నిరసన తెలుపుతున్న వారందరినీ అరెస్టు చేశారు. అత్యవసర చికిత్స నిమిత్తం పీకేను అంబులెన్సులో దీక్షా స్థలి నుంచి ఆస్పత్రికి తరలించారు.ఈసందర్భంగా పీకే మాట్లాడుతూ.. బీపీఎస్సీలో జరుగుతున్న అవకతవకలపై జనవరి 7న పాట్నా హైకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. బీపీఎస్సీ అవకతవకల అంశంపై తమ పోరాటాన్ని ఎవరూ ఆపలేరని.. ఆరునూరైనా అది కొనసాగి తీరుతుందన్నారు.
Also Read :Attack On Pak Army : పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై సూసైడ్ ఎటాక్.. 47 మంది సైనికులు మృతి ?
డిసెంబరు 13న బీపీఎస్సీ నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ కంబైన్డ్ (ప్రిలిమినరీ) పోటీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైందనే ప్రచారం జరిగింది. దీంతో ఆ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ అభ్యర్థులు గాంధీ మైదాన్‌లో ఈ దీక్ష చేస్తున్నారు. ‘‘ఆ పరీక్షను ఈ నెలాఖరులోగా మళ్లీ నిర్వహిస్తామని బిహార్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి. లేదంటే నిరసనకారులు జనవరి 26న ఇదే గాంధీ మైదాన్‌లో జరగాల్సిన రిపబ్లిక్ డే ఉత్సవాలను అడ్డుకుంటారు. ఆ ఉత్సవాలను అడ్డుకునేందుకు బిహార్‌లోని ప్రతీ బ్లాక్ నుంచి 500 మంది విద్యార్థులు చొప్పున తరలి వస్తారు’’ అని ఇటీవలే ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు.
Also Read :CM Revanth: తెలుగువారి హవా తగ్గింది.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
మరోవైపు బిహార్ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న ఆర్‌జేడీ పార్టీ అగ్రనేత తేజస్వి యాదవ్ ఈ నిరసనలను రాజకీయ కోణంలో చూస్తున్నారు. నిరసనల్లో పాల్గొంటున్న పీకేను బీజేపీ బీ టీమ్‌గా ఆయన అభివర్ణిస్తున్నారు. అయితే విద్యార్థుల ఉద్యమానికి ఏ పార్టీ బ్యానర్ కూడా లేదని పీకే వాదిస్తున్నారు. తేజస్వి వచ్చి ఈ ఉద్యమాన్ని లీడ్ చేస్తానంటే తాను పక్కకు తప్పుకుంటానని ఆయన తేల్చి చెబుతున్నారు.