Terror Boat: టెర్రర్ బోట్ కలకలం
సముద్రంలో కొట్టుకొచ్చిన ఓ పడవ.. యావత్ దేశం ఉలిక్కిపడేలా చేసింది. బోటులో ఏకే47, బుల్లెట్లు, పేలుడు పదార్థాలు ఉండటంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
- By Naresh Kumar Published Date - 07:15 PM, Thu - 18 August 22

సముద్రంలో కొట్టుకొచ్చిన ఓ పడవ.. యావత్ దేశం ఉలిక్కిపడేలా చేసింది. బోటులో ఏకే47, బుల్లెట్లు, పేలుడు పదార్థాలు ఉండటంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అయితే.. ఇందులో ఎలాంటి కుట్రకోణం లేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
మహారాష్ట్ర సముద్ర తీరంలో ఏకే-47లున్న పడవ కలకలం రేపింది. రాయ్‌గఢ్‌లోని హరిహరేశ్వర్ బీచ్ ప్రాంతంలో ఈ అనుమానాస్పద బోటును స్థానికులు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. బోటు నుంచి 3 ఏకే 47 రైఫిళ్లతోపాటు బుల్లెట్లు, పేలుడు పదార్థాలను సీజ్ చేశారు పోలీసులు. ఉగ్రకోణం ఉండొచ్చన్న అనుమానంతో రాయ్‌గఢ్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర ATSతోపాటు NIA అధికారులు హరిహరేశ్వర్ బీచ్‌కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బోటుకు సంబంధించిన వివరాలు సేకరించారు. ఈ వ్యవహారంలో ఉగ్రకోణం ఏమీ బయటపడలేదు. ఇది ఓ ఆస్ట్రేలియన్‌కు చెందిన పడవ. దీని పేరు లేడీ హాన్. జూన్ 26న మస్కట్ నుంచి యూరప్‌కు బయల్దేరింది. అయితే మధ్యలోనే ఇంజిన్ సమస్య తలెత్తడంతో.. సిబ్బందిని రక్షించి.. బోటును సముద్రంలోనే వదిలేశారు.
అలల తాకిడికి అది కొంకణ్ తీరానికి కొట్టుకొచ్చింది. అయితే బోటులో పేలుడు పదార్థాలు, ఆయుధాలు ఎందుకున్నాయన్నదానిపై దర్యాప్తు కొనసాగుతోందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర పఢ్నవిస్ చెప్పారు. అయితే మహారాష్ట్ర తీరంలో అనుమానాస్పద బోటు అనగానే ముంబై ఉలిక్కిపడింది. 1993 ముంబై పేలుళ్లు, 26/11 మారణహోమం.. ఒక్కసారిగా కళ్లముందు కదిలాయి. దీనికి కారణం ఉంది. 93లో జరిగిన వరుస పేలుళ్లకు దాపూద్ గ్యాంగ్ రాయ్‌గఢ్ తీరం నుంచే పేలుడు పదార్థాలు స్మగ్లింగ్ చేసింది. బోటులో ముంబై తీరానికి చేరుకున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు.. 2008 నవంబర్ 26న మహా నగరంలో మారణహోమం సృష్టించారు. ఇప్పుడు ఆయుధాలతో నిండిన బోటు కనిపించిన హరిహరేశ్వర్ బీచ్.. ముంబై సిటీకి 200 కిలోమీటర్లు, పూణె పట్టణానికి 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొన్నిరోజుల్లో గణేశ్ ఉత్సవాలు మొదలవబోతున్నాయి. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి.