Bharat Bandh Effect : ఈ రంగాలపై తీవ్ర ప్రభావం
Bharat Bandh Effect : దాదాపు 25 కోట్ల మంది కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, వివిధ రంగాలకు చెందిన కార్మిక సంఘాలు ఈ బంద్‌లో పాల్గొంటున్నారు.
- By Sudheer Published Date - 07:06 AM, Wed - 9 July 25

ఈరోజు బుధవారం దేశవ్యాప్తంగా భారత బంద్(Bharat Bandh)కు పిలుపు వెలువడింది. దాదాపు 25 కోట్ల మంది కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, వివిధ రంగాలకు చెందిన కార్మిక సంఘాలు ఈ బంద్‌లో పాల్గొంటున్నారు. దీంతో దేశంలో చాలానే రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా బ్యాంకులు, రైల్వే, ట్రాన్స్‌పోర్ట్, స్టీల్, మైనింగ్, ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేయకపోవచ్చు. చాలా కాలం తర్వాత ఇంత పెద్ద స్థాయిలో దేశవ్యాప్తంగా సమ్మె జరగడం గమనార్హం.
బంద్‌కు పిలుపు ఇచ్చిన సంఘాలు ఎవెవరు?
ఈ బంద్‌కు పిలుపునిచ్చింది దేశంలోని పది ప్రధాన కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు. వీటిలో AITUC, INTUC, CITU, HMS, SEWA, LPF, UTUC వంటి ప్రముఖ కార్మిక సంఘాలతో పాటు సంయుక్త కిసాన్ మోర్చా కూడా భాగమైంది. రైల్వే, NMDC, స్టీల్ ఇండస్ట్రీ కార్మికులు, గ్రామీణ కార్మికులు కూడా బంద్‌కు మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమ్మె బాట పట్టిన ఈ యూనియన్లు, తమ హక్కులను కాపాడుకోవడమే లక్ష్యంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి.
బంద్‌కు ప్రధాన కారణాలు, డిమాండ్లు
కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపిచ్చిన ప్రధాన కారణాలు కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కార్మిక కోడ్స్, ప్రైవేటీకరణ, నిరుద్యోగం, ధరల పెరుగుదల. ఈ కార్మిక కోడ్స్ వల్ల కార్మిక హక్కులు హరించబడుతున్నాయని, సమ్మె హక్కును కోల్పోతున్నామని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఖాళీల భర్తీ జరగకపోవడం, ఉద్యోగ భద్రత లేకపోవడం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ చేతుల్లోకి అప్పగించడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థపై భయం నెలకొందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా MGNREGA వేతనాల పెంపు, పట్టణాల్లో కూడా ఆ పథకాన్ని విస్తరించాలన్న డిమాండ్ లను బలంగా ఉంచారు.
ఈ రంగాలపై బంద్ ప్రభావం
ఈ బంద్ ప్రభావం బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రైల్వే, పోస్టల్, ట్రాన్స్‌పోర్ట్, విద్యుత్, మైనింగ్, ప్రభుత్వ శాఖలు, PSUలపై ఉంటుందని అంచనా. ప్రజా రవాణా తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కార్మికులు ర్యాలీలు, నిరసనలు చేపట్టనున్నారు. అయితే పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ కార్యాలయాలు యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడవవచ్చు, రద్దు అయ్యే అవకాశమూ ఉంది. మొత్తంగా చూస్తే ఈ బంద్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర అసంతృప్తిని ప్రతిబింబిస్తోంది.