Bhaichung Bhutia : భైచుంగ్ భూటియా ఓటమి.. సిక్కింలో ఎస్‌కేఎం విజయం
ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ భైచుంగ్ భూటియా సిక్కిం అసెంబ్లీ ఎన్నికల బరిలో ఓడిపోయే పరిస్థితి నెలకొంది.
- By Pasha Published Date - 02:08 PM, Sun - 2 June 24

Bhaichung Bhutia : ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ భైచుంగ్ భూటియా సిక్కిం అసెంబ్లీ ఎన్నికల బరిలో ఓడిపోయే పరిస్థితి నెలకొంది. సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎస్‌డీఎఫ్) పార్టీ తరఫున బార్ఫుంగ్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన బరిలోకి దిగారు. కడపటి సమాచారం ప్రకారం.. బార్ఫుంగ్ స్థానంలో భైచుంగ్ భూటియా 4వేల ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. అక్కడ సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఎం) అభ్యర్థి రిక్షాల్ దోర్జీ భూటియా ముందంజలో దూసుకుపోతున్నారు.
We’re now on WhatsApp. Click to Join
భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా(Bhaichung Bhutia) గతంలో పశ్చిమ బెంగాల్ నుంచి రెండుసార్లు టీఎంసీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో డార్జిలింగ్ స్థానం నుంచి, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో సిలిగురి స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. అయితే ఆ రెండు ఎన్నికల్లో కూడా భూటియా ఓడిపోయారు. ఈసారి కూడా ఆయన ఓటమి బాటలోనే ఉన్నట్టు కనిపిస్తోంది. బెంగాల్ ఎన్నికల్లో రెండు వరుస ఓటముల తర్వాత.. సిక్కింకు భూటియా షిఫ్టు అయ్యారు. ఆయన 2018 సంవత్సరంలో హమ్రో సిక్కిం పార్టీని స్థాపించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలలో తుమెన్-లింగి స్థానం నుంచి పోటీ చేశారు. అయితే వాటిలోనూ భూటియా ఓడిపోయారు. 2019 సంవత్సరంలోనే గ్యాంగ్‌టక్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆయన ఓటమి పాలయ్యారు.
Also Read : EV Scooter: పూర్తి ఛార్జ్‌తో 95 కిమీ వరకు ప్రయాణం.. ధర రూ. 75,000 కంటే తక్కువే..!
సిక్కింలో అధికారం ఆ పార్టీదే..
- సిక్కింలో ‘సిక్కిం క్రాంతికారీ మోర్చా’ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. అధికారంలోకి వచ్చేందుకు 17 స్థానాల్లో గెలవాలి. అయితే ఇప్పటికే ఈ పార్టీ 21 స్థానాల్లో గెలిచింది. మరో 10 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉంది.
- ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్.. రెనాక్ నియోజకవర్గంలో 7,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సోరెంగ్ చకుంగ్ సీటులోనూ ఆయన ఆధిక్యంలో ఉన్నారు.
- 2019 వరకు అప్రతిహతంగా 25 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన ‘సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్’ ఒక్క స్థానంలోనే గెలిచింది. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు.