Bangladesh : బంగ్లాదేశ్‌లో 21 ఏళ్ల హిందూ మహిళపై అత్యాచారం
Bangladesh : బంగ్లాదేశ్‌లో 21ఏళ్ల హిందూ మహిళపై జరిగిన అమానవీయ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
- By Kavya Krishna Published Date - 12:45 PM, Mon - 30 June 25

Bangladesh : బంగ్లాదేశ్‌లో 21ఏళ్ల హిందూ మహిళపై జరిగిన అమానవీయ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. దారుణానికి పాల్పడిన వ్యక్తి ఓ రాజకీయ పార్టీ నేత కావడంతో, ఘటనపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)కి చెందిన స్థానిక నాయకుడు ఫజోర్ అలీ పై ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయ్యాడు.
ఈ నెల 26వ తేదీ రాత్రి, కుమిల్లా జిల్లా రామ్‌చంద్రపూర్ పచ్కిట్ట గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. బాధితురాలి భర్త విదేశంలో ఉండగా, ఆమె పుట్టింటిలోని ‘హరి సేవ’ పండుగ కోసం వచ్చిన సందర్భంగా ఇంట్లో ఒంటరిగా ఉన్న వేళ ఫజోర్ అలీ బలవంతంగా ఆమె ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, తన గదికి తలుపు మూసినా కూడా నిందితుడు ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించాడని వివరించారు.
ఘటన తర్వాత స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసినా, అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తు జరిపారు. నిందితుడు ఫజోర్ అలీని ఢాకా నగరంలోని సయదాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి అతనితో పాటు మరో నలుగురిని కూడా అరెస్ట్ చేశారు. వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై నిరసనగా ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. నిందితులకు కఠినమైన శిక్ష విధించాలని, మహిళలపై వేధింపులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. “డైరెక్ట్ యాక్షన్” అంటూ నినాదాలతో విశ్వవిద్యాలయం పరిసరాలు హోరెత్తాయి.
ఇక శేక్ హసీనా ప్రభుత్వం తొలగిన తర్వాత దేశంలో హిందూ మైనారిటీలపై దాడులు పెరిగాయన్న ఆరోపణలు కూడా ఈ ఘటన నేపథ్యంలో మళ్లీ చర్చకు వచ్చాయి. హిందూ మహిళల భద్రతపై గట్టి చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘాలు, మైనారిటీ సంస్థలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
Raja Singh : అధ్యక్షుడిని ఓటింగ్ ద్వారా ఎన్నుకోవాలని డిమాండ్