Currency Notes; కరెన్సీ నోట్లపై పెన్ను, పెన్సిల్ తో రాస్తే చెల్లవా? నిజమేంటి?
రూ.2000 నోట్లు వచ్చిన తర్వాత రకరకాల ఫేక్ న్యూస్ లు ప్రజలను ఇబ్బంది పెట్టాయి.
- By Anshu Published Date - 09:13 PM, Sun - 8 January 23

Currency Notes: రూ.2000 నోట్లు వచ్చిన తర్వాత రకరకాల ఫేక్ న్యూస్ లు ప్రజలను ఇబ్బంది పెట్టాయి. గత కొన్ని రోజులుగా రూ.2000 నోట్లు మారవని, ఇకపై వాటిని ముద్రించరని, అలాగే కొత్త నోట్లు కూడా వస్తాయని ఏవేవో వార్తలు సోషల్ మీడియాలో సందడి చేశాయి. తాజాగా ఓ ఫేక్ వార్త కూడా ప్రజలను భయపెడుతోంది. రూ.2000, రూ.500, రూ.200, రూ.100ల నోట్లపై పెన్నుతో గానీ, పెన్సిల్ తో గానీ రాస్తే అవి చెల్లవని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని నమ్మి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ చేసి నిజం ఏంటో తెలిపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజం లేదని, ఇదొక ఫేక్ న్యూస్ అని తేల్చి చెప్పింది. రూ.2000 నోట్లతో సహా అన్ని కరెన్సీ నోట్లపై ఏది రాసినా అవి బ్యాంకుల్లో చెల్లుతాయని తెలిపింది. పెన్నుతో, పెన్సిల్ తో రాసినా ఆ నోట్లు చెల్లుతాయని, అందులో ఎటువంటి సందేహం అవసరం లేదని తెలిపింది.
సాధారణంగా కరెన్సీ నోటు చాలా విలువైనదని, దానిపై పెన్నుతో, పెన్సిల్ తో రాస్తే దాని మన్నిక తగ్గిపోయే అవకాశం ఉందని, దాని వల్ల అవి ఎక్కువ కాలం వాడుకలో ఉండే పరిస్థితి కూడా ఉండని, అందుకే సాధ్యమైనంత వరకూ కరెన్సీ నోట్లపై ఏదీ రాయకండని సూచించింది. కరెన్సీ నోట్లపై ఏది రాసినా వాటిని తీసుకోవచ్చిన ఆర్బీఐ వెల్లడించింది.
ఇటువంటి మార్గదర్శకాలను 2020లోనే ఆర్బీఐ జారీ చేసిందని, అయితే ప్రజలను ఇబ్బంది పెట్టే ఇటువంటి వార్తలు రాయడం తప్పని తెలిపింది. ప్రజలు కూడా ఇటువంటి వార్తలను నమ్మవద్దని, నోట్లపై రాస్తే చెల్లవని చెప్పడం ఫేక్ న్యూస్ అని తెలిపింది. ఆర్బీఐ మార్గదర్శకాలను పాటించని వారికి తగిన శిక్ష కూడా పడుతుందని వెల్లడించింది.