Amul Milk : పాల ధరలను తగ్గించిన అమూల్.. లీటర్ పై ఎంతంటే..?
ఇన్ని రోజులూ అధిక పాల ధరలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు.. తాజా నిర్ణయంతో కాస్త ఊరట లభించినట్లైంది.
- By Latha Suma Published Date - 05:52 PM, Fri - 24 January 25
Amul Milk : దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ ‘అమూల్’పాల ధరలను తగ్గించింది. ఈ విషయాన్ని గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా శుక్రవారం ప్రకటించారు. తాజా నిర్ణయంతో లీటర్ అమూల్ గోల్డ్ పాల ధర రూ.66 నుంచి రూ.65కి తగ్గింది. అమూల్ టీ స్పెషల్ మిల్క్ లీటర్ ప్యాకెట్ ధర రూ.62 నుంచి రూ.61కి, అమూల్ తాజా పాల ధర లీటరుకు రూ.54 నుంచి రూ.53కి తగ్గింది. ఇన్ని రోజులూ అధిక పాల ధరలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు.. తాజా నిర్ణయంతో కాస్త ఊరట లభించినట్లైంది.
కొత్త ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని సంస్థ ప్రకటించింది. అమూల్ బ్రాండ్ ఉత్పత్తుల హైక్వాలిటీని కొనసాగిస్తూ వినియోగదారులకు మరింత లబ్ది చూకూర్చేందుకు తాజా నిర్ణయం తీసుకున్నట్టు జయేన్ మెహతా ఒక ప్రకటనలో తెలిపారు. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. లీడింగ్ డెయిరీ బ్రాండ్‌లలో ఒకటైన అమూల్ దేశంలో కోట్లాది మందికి పాల సరఫరాలో కీలకంగా ఉంది. గుజరాత్ వ్యాప్తంగా 3.6 మిలియన్ల రైతులు స్వయం ఉపాధి పొందుతున్నారు. కాగా, అమూల్ చివరిసారిగా గతేడాది జూన్‌లో పాల ధరలను లీటరుకు రూ.2 పెంచిన విషయం తెలిసిందే.