Ajit Pawar : వివాదంలో అజిత్ పవార్.. మహిళా ఐపీఎస్ అధికారిణిపై అనుచిత వ్యాఖ్యలు
సోలాపుర్ జిల్లాలోని కుర్దూ గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయనే ఫిర్యాదులు మహిళా ఐపీఎస్ అధికారి అంజనా కృష్ణకు అందాయి. వెంటనే స్పందించిన ఆమె రెండు రోజుల క్రితం అక్కడికి వెళ్లి స్వయంగా తనిఖీలు చేపట్టారు.
- By Latha Suma Published Date - 10:51 AM, Fri - 5 September 25

Ajit Pawar : మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ కొత్త వివాదం తలెత్తింది. ఈసారి రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రత్యక్షంగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. అక్రమ ఇసుక తవ్వకాలపై చొరవతో స్పందించిన ఓ మహిళా ఐపీఎస్ అధికారిణిపై అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా చర్చకు దారి తీశాయి. సోలాపుర్ జిల్లాలోని కుర్దూ గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయనే ఫిర్యాదులు మహిళా ఐపీఎస్ అధికారి అంజనా కృష్ణకు అందాయి. వెంటనే స్పందించిన ఆమె రెండు రోజుల క్రితం అక్కడికి వెళ్లి స్వయంగా తనిఖీలు చేపట్టారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో, అధికారిణి చర్యలను ఆపేందుకు అక్కడికి చేరుకున్న పలువురు ఎన్సీపీ నేతలలో ఒకరు నేరుగా అజిత్ పవార్‌కు ఫోన్ చేశారు.
Read Also: Accident : శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి
అజిత్ పవార్ ఆ సమయంలో అధికారిణితో మాట్లాడాలని సూచించగా, వారి ఫోన్‌ను అంజనా కృష్ణకు ఇచ్చారు. ఫోన్‌లో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ..నేను అజిత్ పవార్ మాట్లాడుతున్నాను. మీ చర్యలను ఆపండి. అక్కడి నుంచి వెళ్లిపోవాలి అంటూ ఆదేశించారు. అయితే, అనుకోని విధంగా అంజనా కృష్ణ ఆయన వాయిస్‌ను గుర్తించలేకపోయారు. మీరు నిజంగా డిప్యూటీ సీఎం అయితే, మీ నంబర్‌కు వీడియో కాల్ చేస్తాను. అప్పుడు నమ్ముతాను అని స్పష్టం చేశారు. ఇది డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను ఆగ్రహానికి గురిచేసింది. నీకు ఎంత ధైర్యం? నన్నే వీడియో కాల్ చేయమంటావా? మీపై చర్యలు తీసుకుంటా అంటూ మండిపడ్డారు. అయినా, ఐపీఎస్ అధికారిణి తలొంచక, వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసి ఆయనతో మాట్లాడారు. అప్పుడే ఆమెకు నిజంగా ఆయనే అజిత్ పవార్ అని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ అక్కడే ఉన్న స్థానికులలో కొందరికి మొబైల్‌లో రికార్డ్ అయ్యింది.
ఆ వీడియో సోషల్ మీడియాలో పెడుతూ, విస్తృతంగా వైరల్ అయింది. ఈ సంఘటనపై ప్రజల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు అధికారిణి ధైర్యాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు అజిత్ పవార్ వ్యవహారశైలిని విమర్శిస్తున్నారు. మహిళా అధికారి పని తీరును ప్రశంసిస్తూ, ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులు కూడా నియమాలకీ చట్టాలకీ లోబడే వర్గమేనని కొందరు న్యాయవాదులు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో, ఈ వీడియో బయటపడటం ఎన్సీపీ శ్రేణుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. రాజకీయ ప్రతిపక్షాలు దీనిని ఆయుధంగా మలుచుకుంటూ, ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాయి. మహిళా అధికారుల పట్ల అసభ్య వ్యాఖ్యలు చేయడం అజిత్ పవార్‌కు ఎంతవరకు సరైన చర్యనన్న దానిపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. అధికార వర్గాలు దీనిపై ఎలా స్పందిస్తాయన్నది వేచి చూడాల్సిన విషయంగా మారింది.