shivaji maharaj : కూలిపోయిన ఛత్రపతి శివాజీ మహరాజ్ భారీ విగ్రహం..!
మల్వాన్‌లోని రాజ్‌కోట్ కోట వద్ద మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో 35 అడుగుల విగ్రహం కూలిపోయినట్లు తెలుస్తోంది. కూలిపోవడానికి గల కారణం ఇంకా తెలియరాలేదని ఓ అధికారి తెలిపారు. నిపుణులు ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారిస్తారని పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 07:05 PM, Mon - 26 August 24

chhatrapati shivaji maharaj statue: మహారాష్ట్ర సింధుదర్గ్ జిల్లాలో ఏర్పాటు చేసిన మరాఠా రాజు ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం సోమవారం (ఈరోజు) కూలిపోయింది. ఈ విగ్రహాన్ని గతేడాది ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. మల్వాన్‌లోని రాజ్‌కోట్ కోట వద్ద మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో 35 అడుగుల విగ్రహం కూలిపోయినట్లు తెలుస్తోంది. కూలిపోవడానికి గల కారణం ఇంకా తెలియరాలేదని ఓ అధికారి తెలిపారు. నిపుణులు ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారిస్తారని పేర్కొన్నారు. అయితే జిల్లాలో గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు, ఈదురు గాలులు పడుతున్నాయని అధికారి వివరించారు. పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, నేవీ డే సందర్భంగా గతేడాది డిసెంబర్ 4న ప్రధాని మోడీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఎన్సీపీ (ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి జయంత్ పాటిల్ విగ్రహం కుప్పకూలడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వమే సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. పనుల నాణ్యతపై ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టలేదని విమర్శించారు. కేవలం ఒక కార్యక్రమం నిర్వహించడంపైనే దృష్టి సారించిందని మండిపడ్డారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించిన మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త టెండర్లు మాత్రమే జారీ చేసి కమీషన్లు తీసుకుందని ఆరోపించారు.
శివసేన (యుబిటి) ఎమ్మెల్యే వైభవ్ నాయక్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పనిలో నాణ్యత లేనిదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించవచ్చని పేర్కొన్నారు. విగ్రహం నిర్మాణం, ఏర్పాటుకు బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై మహారాష్ట్ర మంత్రి దీపక్ కేసర్కర్ స్పందించారు. ఈ సంఘటనకు సంబంధించిన అన్ని వివరాలు తన వద్ద లేవన్నారు.
Read Also: CM Revanth Reddy : త్వరలోనే మరో 35 వేల ఉగ్యోగాల భర్తీ : సీఎం రేవంత్ రెడ్డి