US : అమెరికాలో 30 మంది భారతీయుల అరెస్టు.. దేశ బహిష్కరణకు సిద్ధం
- Author : Prasad
Date : 02-06-2026 - 11:20 IST
Published By : Hashtagu Telugu Desk
అమెరికాలో అక్రమంగా నివసిస్తూ వాణిజ్య ట్రక్కు డ్రైవర్లుగా పనిచేస్తున్న సుమారు 30 మంది భారతీయులను అమెరికా ఫెడరల్ అధికారులు అరెస్టు చేశారు. వీరిని త్వరలో స్వదేశాలకు బహిష్కరించే ప్రక్రియ ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) విడుదల చేసిన వివరాల ప్రకారం.. మే 11 నుంచి 15 వరకు అరిజోనా రాష్ట్రంలోని యూమా సెక్టార్‌లో నిర్వహించిన ‘ఆపరేషన్ చెక్‌మేట్’ సందర్భంగా మొత్తం 52 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 36 మంది సెమీ-ట్రక్కులు నడుపుతున్నట్లు గుర్తించారు. అరెస్టయిన 36 మంది ట్రక్ డ్రైవర్లలో 30 మంది భారతీయులు కాగా, మిగిలిన వారు మెక్సికో, రష్యా దేశాలకు చెందినవారని అధికారులు తెలిపారు. వీరిలో కొందరి వద్ద కాలిఫోర్నియా, న్యూయార్క్, వాషింగ్టన్, వర్జీనియా రాష్ట్రాలకు చెందిన కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు ఉండగా, మరికొందరి వద్ద ఎలాంటి చెల్లుబాటు అయ్యే లైసెన్సులు లేవని వెల్లడించారు.
అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. పలువురు డ్రైవర్లు గతంలో జో బైడెన్ పరిపాలన కాలంలో పొందిన ఉపాధి అనుమతి పత్రాలను ఉపయోగిస్తున్నప్పటికీ అవి ప్రస్తుతం చెల్లుబాటు కావడం లేదు. దీంతో ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం వారిపై చర్యలు తీసుకుని దేశ బహిష్కరణ చేపట్టనున్నారు. ‘ఆపరేషన్ చెక్‌మేట్’ ప్రధాన ఉద్దేశ్యం అమెరికాలో అక్రమంగా నివసిస్తూ వాణిజ్య వాహనాలను నడుపుతున్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవడమేనని అధికారులు తెలిపారు. యూమా సెక్టార్ యాక్టింగ్ చీఫ్ పెట్రోల్ ఏజెంట్ డస్టిన్ కాడిల్ మాట్లాడుతూ, ప్రజల భద్రతకు ముప్పుగా మారే అక్రమ డ్రైవర్లను గుర్తించి చర్యలు తీసుకోవడం తమ బాధ్యతని.. రహదారులపై ప్రమాదాలను నివారించేందుకు ఫెడరల్ ఏజెంట్లు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నామని తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం, వాణిజ్య ట్రక్కులు, బస్సులను నడిపే విదేశీ డ్రైవర్లపై కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. అనర్హులైన లేదా చట్టబద్ధ అనుమతులు లేని వ్యక్తులు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు పొందకుండా చర్యలు చేపట్టింది. ఇటీవల అమెరికాలో భారత సంతతికి చెందిన కొందరు ట్రక్ డ్రైవర్లు రోడ్డు ప్రమాదాలకు కారణమైన ఘటనలు వెలుగులోకి రావడంతో, వాణిజ్య వాహనాల రంగంలో అక్రమ వలసదారులపై నిఘా మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిణామం అమెరికాలో ఉద్యోగాల కోసం వెళ్లిన భారతీయులలో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా చట్టబద్ధ పత్రాలు లేకుండా పనిచేస్తున్న వలసదారులపై అమెరికా ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.