Gujarat Floods : వరద వలయంలో గుజరాత్.. సురక్షిత ప్రాంతాలకు 23,870 మంది
వడోదరలో విశ్వమిత్రి నదిలో నీట మట్టం ప్రమాదకర స్థాయిలో పెరగడంతో నగరంలోని ఏడు వంతెనలను మూసివేశారు.
- By Pasha Published Date - 10:23 AM, Wed - 28 August 24
Gujarat Floods : గుజరాత్‌లోని వివిధ జిల్లాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. ప్రధానంగా మోర్బీ, గాంధీనగర్, ఆనంద్, వడోదర, ఖేదా, మహిసాగర్, భరూచ్, అహ్మదాబాద్ ప్రాంతాలు వరదల వల్ల ఎక్కువగా ప్రభావిత మయ్యాయి. ఆయా చోట్ల వర్షం వల్ల చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో 15 మంది చనిపోయారు. వడోదరలో విశ్వమిత్రి నదిలో నీట మట్టం ప్రమాదకర స్థాయిలో పెరగడంతో నగరంలోని ఏడు వంతెనలను(Gujarat Floods) మూసివేశారు. బరూచ్ జిల్లాలో గోల్డెన్ బ్రిడ్జి దగ్గర నర్మదా నది 24 అడుగుల ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
డైమండ్ సిటీ సూరత్‌లోనూ లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. వర్షాల ధాటికి సురేందర్‌నగర్ జిల్లాలో ఓ బ్రిడ్జి కూలిపోయింది. వరదల్లో చిక్కుకున్న దాదాపు 1,696 మందిని రెస్క్యూ టీమ్స్ రక్షించాయి. ద్వారక, ఆనంద్, వడోదర, ఖేడ, మోర్బి, రాజ్‌కోట్ జిల్లాల్లో సైన్యం, 14 ఎన్‌డీఆర్‌ఎఫ్, 22 ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి.వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన దాదాపు 23,870 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాబోయే మూడు రోజులు కూడా గుజరాత్‌లోని పలు జిల్లాలకు భారీ వర్షసూచన ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరిక జారీ చేసింది. రెస్క్యూ. రిలీఫ్ ఆపరేషన్లను నిర్వహించేందుకు ఆరు ఇండియన్ ఆర్మీ బృందాలను పంపాలని కేంద్ర ప్రభుత్వాన్ని గుజరాత్ సర్కారు కోరింది.
కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు మళ్లీ వరద
ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతుండడంతో కృష్ణా, తుంగభద్ర నదులకు వరద పోటెత్తుతోంది. ఇప్పటికే కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ ఫుల్కెపాసిటీకి చేరుకున్నాయి. జులై మూడో వారం నుంచి ఇప్పటి వరకు ఎగువ ప్రాంతాల నుంచి తెలంగాణ ప్రాజెక్టులకు దాదాపు 800 టీఎంసీల వరద నీరు వచ్చింది. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లోని ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర (టీబీ డ్యామ్) ప్రాజెక్టులు ఫుల్ కెపాసిటికీ చేరాయి.