165 People Sentenced To Death: అత్యధికంగా 165 మందికి మరణశిక్ష
గత ఏడాది 2022లో దేశవ్యాప్తంగా దిగువ కోర్టులు 165 మందికి మరణశిక్ష (Sentenced To Death) విధించాయి. గత రెండు దశాబ్దాలలో ఒక సంవత్సరంలో దిగువ కోర్టులు విధించిన మరణ శిక్షల్లో ఇదే అత్యధికం. ఇది ఒక నివేదికలో క్లెయిమ్ చేయబడింది. 2021 సంవత్సరం ప్రారంభంలో ఈ సంఖ్య 146.
- Author : Gopichand
Date : 31-01-2023 - 10:35 IST
Published By : Hashtagu Telugu Desk
గత ఏడాది 2022లో దేశవ్యాప్తంగా దిగువ కోర్టులు 165 మందికి మరణశిక్ష (Sentenced To Death) విధించాయి. గత రెండు దశాబ్దాలలో ఒక సంవత్సరంలో దిగువ కోర్టులు విధించిన మరణ శిక్షల్లో ఇదే అత్యధికం. ఇది ఒక నివేదికలో క్లెయిమ్ చేయబడింది. 2021 సంవత్సరం ప్రారంభంలో ఈ సంఖ్య 146. నివేదికలో మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. గతేడాది దిగువ కోర్టులు మరణశిక్ష విధించిన 165 మందిలో ప్రతి మూడవ వ్యక్తి లైంగిక నేరాలకు సంబంధించిన వారే. గతేడాది చివరినాటికి మరణశిక్షను ఎదుర్కొంటున్న మొత్తం ఖైదీల సంఖ్య 539కి చేరింది. 2000 తర్వాత ఒక్క ఏడాదిలో ఇంతమందికి మరణశిక్షలు విధించడం ఇదే తొలిసారి. ‘డెత్ పెనాల్టీ ఇన్ ఇండియా’ రిపోర్టు ప్రకారం గతేడాది గుజరాత్‌లో అత్యధికంగా 51 మందికి మరణశిక్షలు పడ్డాయి. ఉరిశిక్షపడ్డ 539 మంది ఖైదీల్లో అత్యధికులు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నారు.
నేషనల్ లా యూనివర్సిటీ (NLU) ప్రాజెక్ట్ 39A ‘భారతదేశంలో మరణశిక్ష, వార్షిక గణాంకాల నివేదిక, 2022’ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి. ఈ నివేదిక ప్రకారం.. 2015 నుండి మరణశిక్ష ఖైదీల సంఖ్య 2022కి 40 శాతం పెరిగింది. 2022 చివరి నాటికి, మరణశిక్ష పడిన ఖైదీలు 539 మంది ఉన్నారు. దిగువ కోర్టులు విధించే మరణశిక్షలు, పై అప్పీలేట్ కోర్టులలో ఇటువంటి కేసుల విచారణలో జాప్యం కారణంగా ఈ సంఖ్య పెరుగుతోందని నివేదిక పేర్కొంది. గత ఏడాది మరణశిక్షలు విధించిన కేసుల్లో 50 శాతం (51.28 శాతం) లైంగిక నేరాలకు సంబంధించినవేనని నివేదిక పేర్కొంది.
‘భారతదేశంలో మరణశిక్ష, వార్షిక గణాంకాల నివేదిక, 2022’ ప్రకారం.. 2022లో అహ్మదాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో అత్యధిక మరణశిక్షలు విధించబడ్డాయి. ఈ కేసులో ట్రయల్ కోర్టు 38 మందికి మరణశిక్ష విధించింది. 2016 నుంచి ఒకే కేసులో ఇంతమందికి మరణశిక్ష విధించిన ఏకైక కేసు ఇదే. ఈ కేసు కారణంగా 2022 సంవత్సరంలో మరణశిక్షకు గురయ్యే వారి సంఖ్య అపూర్వంగా పెరిగింది. గత సంవత్సరం ట్రయల్ కోర్టు, హైకోర్టు మరణశిక్ష విధించడానికి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఉరిశిక్ష విధించే ముందు ట్రయల్ కోర్టు నేరం ఏ పరిస్థితుల్లో జరిగిందో చూడాలని సుప్రీం కోర్టు పేర్కొంది. దీనితో పాటు నేరస్థుడి నేపథ్యం ఏంటనేది కూడా పరిగణించాలని కూడా పేర్కొంది.