Aircraft Range Buses : 132 సీట్లతో విమానం రేంజులో బస్సులు
మూడు ఎలక్ట్రిక్ బస్సులు కలిపి ఒకే బస్సులా రోడ్డుపైకి వచ్చే రోజులు ఎంతోదూరంలో లేవు.
- By Pasha Published Date - 04:49 PM, Wed - 3 July 24

Aircraft Range Buses : మూడు ఎలక్ట్రిక్ బస్సులు కలిపి ఒకే బస్సులా రోడ్డుపైకి వచ్చే రోజులు ఎంతోదూరంలో లేవు. ఇలా చేయడం ద్వారా తీసుకొచ్చే ట్రిపుల్ సైజు బస్సులో 132 దాకా సీట్లు ఉంటాయి. ఇవన్నీ ఎలక్ట్రిక్ బస్సులు. దీంతో ప్రతి 40 కి.మీ జర్నీ తర్వాత వాటికి ఛార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఛార్జింగ్ చేసుకోవడానికి కేవలం 40 సెకన్ల టైం పడుతుంది. ఇందుకోసం ఖర్చయ్యేది కేవలం రూ.40 మాత్రమే. అలా అని ఈ బస్సుల్లో సౌకర్యాలు తక్కువగా ఉంటాయని అనుకుంటున్నారు. వీటిలో విమానం రేంజులో వసతులు ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంటాయి. అచ్చం విమానంలో ఉన్నట్టే సీటింగ్, ఏసీ సౌకర్యం, సీటు ముందు ల్యాప్‌టాప్ పెట్టుకొనే సౌలభ్యం ఉంటాయి. ఎయిర్ హోస్టెస్ మాదిరిగా పండ్లు, ప్యాక్ చేసిన ఆహారం, శీతల పానీయాలు అందించేందుకు ‘బస్ హోస్టెస్’ ఉంటారు. డీజిల్ బస్సులతో పోలిస్తే.. ఈ రకం ట్రిపుల్ సైజు ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు 30శాతం ఖర్చు తక్కువే అవుతోందట. ఈ వివరాలన్నీ స్వయంగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇలాంటి బస్సులతో పైలట్ ప్రాజెక్టును ప్రస్తుతం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. టాటా కంపెనీ సహకారంతో ఆ ప్రాజెక్టు అమలవుతోందన్నారు.
We’re now on WhatsApp. Click to Join
మన దేశంలో కాలుష్యరహిత రవాణా సదుపాయాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతోనే ఈ ట్రిపుల్ సైజు ఎలక్ట్రిక్ బస్సులతో పైలట్ ప్రాజెక్టును నిర్వహిస్తున్నామని గడ్కరీ వెల్లడించారు. ‘‘డీజిల్ బస్సు కి.మీ. ప్రయాణానికి రూ.115 ఖర్చు అవుతోంది. అదే ఎలక్ట్రిక్ ఏసీ బస్సులో కి.మీ ప్రయాణానికి కేవలం రూ.60 అవుతుంది. ఈ మార్పు వల్ల టికెట్ రేట్లు తగ్గిపోతాయి’’ అని ఆయన చెప్పారు. లీటరు పెట్రోల్‌కు రూ.120 ఖర్చుపెట్టే బదులు, మనం రూ.60తో ఇథనాల్ ఇంధనాన్ని వాడుకునే టైం రాబోతోందని గడ్కరీ తెలిపారు.రానున్న రోజుల్లో దేశంలో వందలాది ఇథనాల్ పంపుల్ ఏర్పాటవుతాయని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా పెరుగుతుందన్నారు. తాను చెక్ రిపబ్లిక్ పర్యటనకు వెళ్లినప్పుడు ట్రిపుల్ బస్సులవ రాకపోకలను చూశానని.. దాని నుంచి స్ఫూర్తిని పొంది నాగ్‌పూర్‌లో పైలట్ ప్రాజెక్టును మొదలుపెట్టానని గడ్కరీ(Aircraft Range Buses) వివరించారు.