హుజురాబాద్ లో భారీ పోలింగ్ ఎవరికి అనుకూలం.?
హుజురాబాద్ పోలింగ్ సరళిని చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు పోలవుతుందా? లేక మోడీ సర్కార్ కు వ్యతిరేకంగానా? అనే అంశం తెరమీదకు వస్తుంది.
- By Hashtag U Published Date - 12:52 PM, Sat - 30 October 21

హుజురాబాద్ పోలింగ్ సరళిని చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు పోలవుతుందా? లేక మోడీ సర్కార్ కు వ్యతిరేకంగానా? అనే అంశం తెరమీదకు వస్తుంది. మహిళలు ఎక్కువగా పోలింగ్ బూత్ ల వద్ద భారీగా క్యూ కట్టారు. తొలి గంటలోనే 10శాతంపైగా ఓట్లు పోలయ్యాయంటే 90శాతానికి పైగా పోలింగ్ జరిగే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి, ఈటెల రాజకీయ భవిష్యత్ కు మధ్య జరుగుతున్న ఉప ఎన్నికగా భావిస్తున్నారు. సుదీర్ఘ ప్రచారం తరువాత జరుగుతోన్న హూజురాబాద్ పోలింగ్ సరళిని గమనిస్తే ఓటర్లు ఒన్ సైడ్ ఉన్నారా? అనే అనుమానం కలుగుతోంది.
సహజంగా పోలింగ్ భారీగా అయిందంటే స్థానిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు పడుతుందని అంచనా వేస్తుంటారు. కానీ, హుజురాబాద్ విషయంలో అంచనా వేయడం కష్టం. ఎందుకంటే, ఈటెల రాజేంద్రకు పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గం హుజురాబాద్. వరుసగా ఆయన అక్కడ నుంచి గెలుపొందుతూ వస్తున్నాడు. ఆయన మీద పెద్దగా వ్యతిరేకత లేకపోగా, కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా ఈటెలను బర్తరఫ్ చేశాడని సానుభూతి ఉంది. అదే సమయంలో ఆయన పోటీ చేసిన బీజేపీ విధానాలు, ధరల పెంపు వంటి అంశాలు ప్రజల మధ్య చర్చ ఉన్నదనడంలో సందేహం లేదు.ఈటెల వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం మధ్య పోటీగా ఓటర్లు తీసుకుంటే ఫలితాలు ఈటెలకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. పార్టీల పరంగా బీజేపీ వర్సెస్ టీఆర్ ఎస్ మధ్య పోటీగా ఓటర్లు భావిస్తే ఫలితాలు ఇంకో విధంగా ఉండేందుకు ఛాన్స్ లేకపోలేదు. తొలి నుంచి ద్విముఖ పోటీ హుజురాబాద్ ఉప ఎన్నికలో ఉంటుందని అంచనా. చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బల్మూరి వెంకట బరిలోకి దిగినప్పటికీ పోటీ నామమాత్రమే అనేది సర్వత్రా వినిపిస్తోన్న మాట. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మంగా తీసుకున్న ఈ ఎన్నిక ఫలితాలు కేవలం రాజేంద్ర కు జరిగిన అన్యాయం అనే అంశం ఎజెండా జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒక వేళ అదే ఓటర్ల అభిప్రాయంగా ఓటు వేస్తే ఖచ్చితంగా ఈటెల గెలుపు ఖాయం కానుంది.
ఉప ఎన్నికలో మునుపెన్నడూ లేని విధంగా డబ్బు పంపిణీ జరిగింది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఆ విషయంలో ఏ మాత్రం వెనుక తగ్గలేదు. పోలింగ్ జరుగుతోన్న కేంద్రాల వద్ద కూడా ఆ రెండు పార్టీల హడావుడి కనిపించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ కు వచ్చిన కౌశిక్ రెడ్డి పోలింగ్ సందర్భంగా కీలక నేతగా కనిపించాడు. ఆయన కొన్ని పోలింగ్ కేంద్రాలకు పదేపదే రావడం ఘర్షణకు దారితీసింది. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ హోదాలో పలు చోట్ల తిష్టవేయడంతో బీజేపీ కార్యకర్తలు ఆయన్ను వెంబడించారు. జమ్మిగుంట పోలింగ్ కేంద్రంతో పాటు 176వ పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది.
హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ సరళిని గమనిస్తే ఇంచుమించుగా దుబ్బాక పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ కూడా హోరాహోరీగా ఆనాడు ప్రచారం నిర్వహించారు. గెలుపు బాధ్యతలను దుబ్బాకలో మంత్రి హరీశ్ రావు భుజస్కందాలపై వేసుకున్నాడు .ఇప్పుడు కూడా హుజురాబాద్ లో హరీశ్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ను గెలిపించాలని సర్వశక్తులు ఒడ్డాడు. దుబ్బాక ప్రచారానికి దూరంగా ఉన్నట్టే హుజురాబాద్ కూ కేసీఆర్ మొఖం చాటేశాడు. సభను చివరి నిమిషంలో రద్దు చేసుకున్నాడు. దీన్ని గమనిస్తే, హుజురాబాద్ టీఆర్ఎస్ కు అనుకూలంగా లేదని ప్రత్యర్థులు ప్రచారం చేశారు. కానీ, బీజేపీ కంటే 13శాతం అదనంగా ఓట్లను టీఆర్ఎస్ చేజిక్కించుకుంటుందని కేసీఆర్ అంచనా. ఆయన అంచనాలకు అనుగుణంగా చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ టీఆర్ఎస్ కు అనుకూలంగా మారాడని హుజురాబాద్ లోని టాక్.
మధ్యాహ్నంకు 50శాతంపైగా పోలింగ్ శాతం నమోదు అయిన క్రమంలో ఎవరికి వారే తమకు అనుకూలంగా పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చారని అంచనా వేస్తున్నారు. మహిళా ఓటర్లు ఎక్కువగా తమకు అనుకూలంగా ఓటేశారని టీఆర్ఎస్ భావిస్తోంది. అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ నడుమ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ పీసీసీగా రేవంత్ సారథ్యంలో జరుగుతోన్న తొలి ఎన్నిక ఇది. ఈ ఫలితాలు ఆయన చరిష్మా మీద పడతాయా? లేక బల్మూరి వెంకట్ బకరాగా మిగులుతారా? అనేది కాంగ్రెస్ పార్టీలోని చర్చ. మొత్తం మీద ప్రధాన పార్టీలకు ఈ ఉప ఎన్నిక ఫలితం ప్రతిష్టాత్మకమే. ఈ ఫలితాల ఆధారంగా 2023 సాధారణ ఎన్నికల హడావుడి ఉంటుందనడంలో సందేహం లేదు.
Related News

Padi Kaushik Reddy : అప్పుడే వాగ్దానాలు మొదలు పెట్టిన కౌశిక్ రెడ్డి.. హుజురాబాద్‌లో గెలిపిస్తే 1000 కోట్లు తెస్తాడట..
తాజాగా నేడు హుజురాబాద్ హైస్కూల్ గ్రౌండ్ లో మినీ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చారు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి.