Yubari King Melon : ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండు ఏంటో..? దాన్ని ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?
Yubari King Melon : యుబారి కింగ్ మెలోన్ జూన్ నుండి ఆగస్టు తొలి వారంలో మాత్రమే మార్కెట్‌లో లభ్యం అవుతుంది. 2018లో రెండు యుబారి మెలోన్స్ 3.2 మిలియన్ జపనీస్ యెన్‌కు (సుమారు రూ. 20 లక్షలు) అమ్ముడయ్యాయి
- By Sudheer Published Date - 09:39 AM, Mon - 24 March 25

పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనవి. ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌ను సమృద్ధిగా అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మార్కెట్‌లో అనేక రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి, అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండుగా యుబారి కింగ్ మెలోన్ (Yubari King Melon) వార్తల్లో నిలిచింది. ఈ ప్రత్యేకమైన పండు జపాన్‌లోని హొక్కైడో ద్వీపంలోని యుబారి ప్రాంతంలో మాత్రమే పండుతుంది. తీపిగా, గుడ్రంగా, ప్రత్యేక పెంపకం పద్ధతుల కారణంగా ఈ పుచ్చకాయ అత్యంత ఖరీదైనదిగా నిలిచింది.
ఈ పండ్లు గుండ్రంగా, మెరుస్తూ ఉండే సున్నితమైన తొక్కతో ఉంటాయి. లోపల నారింజ రంగులోని గుజ్జు తీపిగా ఉండటమే కాకుండా, ఆకర్షణీయమైన వాసనను కలిగి ఉంటుంది. చుగెన్ అనే జపాన్ సంప్రదాయ బహుమతుల కార్యక్రమంలో ఈ పండును ప్రత్యేక బహుమతిగా అందజేస్తారు. యుబారి కింగ్ పుచ్చకాయలను అత్యంత శ్రద్ధతో , ప్రతిరోజూ శుభ్రం చేస్తుంటారు, ప్రత్యేకంగా పెంచిన నేలలో సాగు చేస్తారు. ఒక్కో పండును సుమారు 1.5 నుంచి 2 కిలోల వరకు బరువుతో పండిస్తారు. ఈ పండును కంటాలౌప్ మరియు బర్పీస్ స్పైసీ కంటాలౌప్ అనే రెండు ప్రత్యేక జాతుల మిశ్రమం ద్వారా అభివృద్ధి చేశారు.
యుబారి కింగ్ మెలోన్ జూన్ నుండి ఆగస్టు తొలి వారంలో మాత్రమే మార్కెట్‌లో లభ్యం అవుతుంది. 2018లో రెండు యుబారి మెలోన్స్ 3.2 మిలియన్ జపనీస్ యెన్‌కు (సుమారు రూ. 20 లక్షలు) అమ్ముడయ్యాయి. 2019లో మరొక జత 46,500 డాలర్లకు (సుమారు రూ. 35 లక్షలు) అమ్ముడైంది, ఇది ఇప్పటి వరకు రికార్డు ధర. ఈ ఖరీదైన పండ్ల జాబితాలో మియాజాకి మామిడి, రూబీ రోమన్ ద్రాక్ష, డెన్సుకే పుచ్చకాయ కూడా ప్రఖ్యాతి గాంచాయి. ఆరోగ్య ప్రయోజనాలు, ప్రత్యేకమైన పెంపకం విధానాలు, అనుపమమైన రుచుల కారణంగా ఈ పండ్లు ప్రపంచవ్యాప్తంగా ఖరీదైనవి మరియు ప్రతిష్టాత్మకమైనవి గా మారాయి.