Weight Loss: సడెన్ గా బరువు తగ్గారా..? అయితే ఆ క్యాన్సర్ లక్షణాలివే..!!
మహేశ్ వయస్సు 40 సంవత్సరాలు. ఆయనకు ముగ్గురు పిల్లలు. తరచుగా కడుపులో ఏదో తెలియని బాధ.
- By Hashtag U Published Date - 01:48 PM, Wed - 27 April 22

మహేశ్ వయస్సు 40 సంవత్సరాలు. ఆయనకు ముగ్గురు పిల్లలు. తరచుగా కడుపులో ఏదో తెలియని బాధ. అలసట. బరువు కూడా చాలా తగ్గాడు. అయినా రోజులో ఎక్కువ సమయం కష్టపడుతూనే ఉంటాడు. దీంతో అధిక శ్రమ వల్లే ఇలా జరుగుతుందనుకున్నాడు. కొన్ని సందర్భాల్లో మలంలో రక్తం కనిపిస్తుండేది. దాన్ని కూడా అంతగా పట్టించుకోలేదు. వైద్యులను సంప్రదించలేదు. కొంత కాలం తర్వాత సమస్యలు తీవ్రం అయ్యాయి. భార్య ఒత్తిడితో వైద్యులను సంప్రదించాడు. మహేశ్ కు బౌల్ క్యాన్సర్ అని బయట పడింది. దీంతో తీవ్ర విచారంలో మునిగిపోయాడు.
బౌల్ క్యాన్సర్
దీన్నే కోలన్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ అని కూడా అంటుంటారు. పెద్ద పేగులో టిష్యూలో ప్రాణాంతక క్యాన్సర్ కణాలు చేరుతాయి. ఈ మధ్య ఎక్కువగా వెలుగుచూస్తున్న క్యాన్సర్ కేసుల్లో ఇది ఒక రకం. కుటుంబ చరిత్ర, అధిక రిస్క్ అడెనోమస్ లేదా పాలిప్స్ , అధికబరువు, పొగతాగడం, మద్యపానం ఈ సమస్యకు కారణం కావచ్చు.
ప్రముఖ మయోక్లినిక్ నిర్వచనం ప్రకారం…కోలన్ క్యాన్సర్ సాధారణంగా పెద్దవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అదే సమయంలో ఏ వయస్సులోనైనా వచ్చే అవకాశం ఉంటుంది. మొదట పెద్ద పేగుల్లో పాలిప్స్ మాదిరిగా మొదలవుతుంది. ఆ తర్వాత కొంత కాలానికి క్యాన్సర్ గా మారుతుంది. దీనిని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఇది పాలిప్స్ క్యాన్సర్ గా మారకముందే తీసి వేయించుకుంటే నయం అవుతుంది.
లక్షణాలు…
కోలన్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే…కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. మలవిసర్జన ఒకేసారి పూర్తి చేయకపోవడం. పలు సార్లు వెళ్లాల్సి రావడం. ప్రేగు కదలికలు అసౌకర్యంగా ఉండటం. ఇవన్నీ కూడా కోలన్ క్యాన్సర్ సంకేతాలుగా చెప్పువచ్చు. మరీ ముఖ్యంగా మలంలో రక్తం కనిపిస్తుంటే…నిర్లక్ష్యం చేయకూడదు. సరైన సమయంలో గుర్తించి చికిత్స చేయించుకోవాలి. లేదంటే శరీరంలోని ఇతర అవయవాలకు సోకే ప్రమాదం ఉంటుంది. ముందుగా కాలేయానికి ఆ తర్వాత ఊపిరితిత్తులకు వ్యాపిస్తుంది.
సడెన్ గా బరువు తగ్గడం…
సడెన్ గా బరువు తగ్గుతుంటే అది క్యాన్సర్ అనే అనుమానించాలి. అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ నిపుణులు తమ వద్దకు వచ్చే క్యాన్సర్ కేసుల్లో 40 శాతం మంది బరువు తగ్గే సమస్యను చూసినట్లుగా చెబుతున్నారు.