Summer Tips: కొబ్బరినీళ్లు, చెరుకు రసం.. వేసవిలో ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచి చేస్తుందో మీకు తెలుసా?
వేసవికాలంలో మనకు ఎక్కువగా లభించే కొబ్బరి నీరు అలాగే చెరుకు రసం ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది చేస్తుందో దేనివల్ల ఎక్కువ లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
- By Anshu Published Date - 09:34 AM, Thu - 13 March 25

వేసవి కాలం మొదలైంది. ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఉదయం 9 గంటల నుంచి భానుడు తీవ్ర ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండలు దంచి కొడుతుండడంతో ప్రజలు బయటికి రావాలి అంటేనే భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో అయితే రోడ్లన్నీ ఖాళీగా ఉంటున్నాయి. ఇకపోతే వేసవికాలం వచ్చింది అంటే మనకు రోడ్డు పక్కన ఎక్కడ చూసినా కూడా చెరుకురసం బండ్లు అలాగే కొబ్బరి బోండాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తక్కువ ధరకే లభించడంతోపాటుగా ఇవి వేసవి తాపాన్ని కూడా తగ్గిస్తాయి. అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయట. అలాగే రుచి పరంగా కూడా అద్భుతంగా ఉంటాయని చెప్పాలి. కొంతమంది కొబ్బరి నీరు తాగితే మరి కొంతమంది చెరుకు రసం తాగుతూ ఉంటారు. ఇవి రెండింటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
కాగా కొబ్బరి నీళ్ల వల్ల కలిగే లాభాల విషయానికి వస్తే.. కొబ్బరి నీటిలో లారీక్ ఆమ్లం ఉండడం వల్ల ఇది యాంటీ మైక్రోబయల్ గా పనిచేస్తుంది. జీవక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే తెల్ల రక్త కణాలు ఉత్పత్తిని పెంచి శరీరాన్ని రకరకాల వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అదేవిధంగా మధుమేహం ఉన్నవారికి కొబ్బరి నీళ్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయట. ఈ నీళ్లలోని విటమిన్లు చర్మాన్ని కాలుష్యం నుండి రక్షించడంతో పాటు, ఎండ కారణంగా జరిగే నష్టం తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నారు.
ఇకపోతే చెరకు రసం వల్ల కలిగే లాభాల విషయానికి వస్తే… చెరుకు రసంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.. ఇది మలబద్ధకం ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్ గుణాలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. అలాగే తెల్ల రక్త కణాలను బలపరిచేలా చేస్తాయి. ఎముకల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. చెరకు రసంలో చక్కెర ఎక్కువగా ఉండటం వలన, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. కాబట్టి, మధుమేహం ఉన్నవారికి ఇది ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వారికి ఈ రసం తాగించకపోవడం మంచిదని చెబుతున్నారు. ఒకవేళ తాగాలి అనుకుంటే ఎప్పుడో ఒకసారి మాత్రమే తాగాలని చెబుతున్నారు.ఈ రెండిటిలో ఇంట్లో ఏది మంచిది అన్న విషయానికి వస్తే.. ఇవి రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాకపోతే వీటిని తీసుకునేటప్పుడు ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచి తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.