Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?
- Author : Vamsi Chowdary Korata
Date : 11-07-2026 - 5:15 IST
Published By : Hashtagu Telugu Desk
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఎంతో మంది పొగ తాగుతూ ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడమే కాకుండా, వారి వల్ల వారి కుటుంబ సభ్యులకు కూడా హాని కలిగిస్తున్నారు. ఈ క్రమంలోనే ధూమపానంపై అవగాహన తీసుకురావడం కోసం అన్ని దేశాల ప్రభుత్వాలు ఎన్నో నిబంధనలను అమలులోకి తీసుకువస్తూ, ప్రజలలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపట్టాయి. ఈ విధంగా ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రజలు మాత్రం వాటిని పెడచెవిన పెట్టారు.
ఈ క్రమంలోనే ప్రతి సిగరెట్ బాక్స్ పై కూడా పొగ తాగడం హానికరం అని రాసినప్పటికీ ప్రజలు తమ అలవాట్లను ఏమాత్రం మార్చుకోవడం లేదు. అయితే ధూమపానంపై అవగాహన పెంచడం కోసం కెనడా ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. ఇకపై సిగరెట్ బాక్స్ పై మాత్రమే కాకుండా ప్రతి సిగరెట్ పై కూడా ‘పొగ తాగుట హానికరం’ అంటూ ప్రింటెడ్ వార్నింగ్ అమలులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇప్పటికే సిగరెట్ బాక్సులపై ఈ నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ ఎవరూ వీటిని పాటించడం లేదు. అందుకే ప్రజలలో మార్పు కోసం కెనడా ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది.
ఈ క్రమంలోనే కెనడా ఆరోగ్య శాఖ మంత్రి కరోలిన్ బెన్నెట్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సిగరెట్ ప్యాకెట్లపై ఉన్న సందేశాలు వాటి కొత్తదనాన్ని కోల్పోయాయని, అందుకే విడివిడిగా ప్రతి పొగాకు ఉత్పత్తిపై ఈ విధమైన హెచ్చరికలను అమలు చేయడం వల్ల అందరిలో అవగాహన ఏర్పడుతుందని, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కరోలిన్ వెల్లడించారు. 2023 ద్వితీయ భాగం నుంచి పొగాకు ఉత్పత్తిపై ‘ప్రతీ పఫ్ లో విషం’ అనే హెచ్చరికను రాస్తూ అమలులోకి తీసుకురావాలన్నదే తమ ఆలోచన అని తెలిపారు.