Health Tips: గ్యాస్, కడుపులో మంటతో తెగ ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
Health Tips: కడుపులో మంట గ్యాస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే చెప్పబోయే చిట్కాలు పాటిస్తే వాటి నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- Author : Anshu
Date : 09-12-2025 - 9:00 IST
Published By : Hashtagu Telugu Desk
Health Tips: ప్రస్తుత రోజుల్లో చాలామంది వయసుతో సంబంధం లేకుండా జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గ్యాస్, కడుపులో మంట, ఉబ్బరం వంటివి చాలామంది ఇబ్బంది పెడుతున్నారు. అయితే కొన్నిసార్లు ఈ గ్యాస్ ఎక్కువ అయ్యి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు చాలా మంది ఈనో వంటి వాటిని తీసుకుంటూ ఉంటారు. నిపుణుల సలహా లేకుండా వాటిని తీసుకోవడం వల్ల లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఇంతకీ గ్యాస్, కడుపులో మంట తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గ్యాస్, కడుపులో మంట వెంటనే తగ్గాలంటే సగం కప్పు చల్లని పాలు తాగితే చాలని చెబుతున్నారు. పాలలో ఉన్న కాల్షియం, ప్రోటీన్లు కడుపులోని ఆమ్లాన్ని కొంతవరకు నిర్జీవం చేస్తాయట. దానివల్ల కొద్దిసేపటికి కడుపులో మంట తగ్గుతుందని, అయితే లాక్టోస్ అసహనం ఉన్నవారు పాలు తాగితే ఈ సమస్య మరింత పెరగవచ్చని చెబుతున్నారు. కడుపులో మంట, గ్యాస్ సమస్యలు వచ్చినప్పుడు అరటి పండు తినడం చాలా మంచిదట. అరటిలో సహజమైన యాంటాసిడ్ లక్షణాలు ఉండటం వల్ల కడుపులోని ఆమ్లాన్ని సమతుల్యం చేసేందుకు సహాయపడతాయట. అరటిలో ఉండే ఫైబర్ కడుపు గోడను రక్షించే పొరలా పనిచేసి దురద, మంటలను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే కొబ్బరి నీళ్లు సహజ ఆల్కలైన్ లక్షణాలు కలిగి ఉండడం వల్ల కడుపులో అధికంగా ఉత్పత్తి అయ్యే ఆమ్లాలను తగ్గించడంలో సహాయపడతాయట. ఇవి కడుపు గోడను శాంతపరిచి మంటను తగ్గించడానికి సహాయపడతాయట.
అంతేకాదు కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం, ఎలక్ట్రోలైట్లు, మైక్రో న్యూట్రియెంట్స్ శరీరంలోని ద్రవాలను సమతుల్యం చేస్తాయని చెబుతున్నారు. గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ తేనె కలిపి తాగితే గ్యాస్, మంట నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. గోరువెచ్చని నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. తేనెలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కడుపు గోడను శాంతపరచడంలో సహాయపడతాయని అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనె వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. మజ్జిగలో కొంచెం జీలకర్ర కలిపి తాగడం వల్ల గ్యాస్, కడుపులో మంట తగ్గుతాయట. మజ్జిగలోని సహజ ప్రోబయాటిక్స్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడి అసిడిటీ తగ్గే అవకాశం ఉంటుందట. జీలకర్రలో ఉండే కార్మినేటివ్ గుణాలు కడుపు ఉబ్బరం తగ్గిస్తాయని చెబుతున్నారు.