Paneer: ప్రతీ రోజు పనీర్ తింటే ఏం జరుగుతుంది.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?
Paneer: పనీర్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. మరి పనీర్ రోజు తింటే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:00 AM, Sat - 27 September 25

Paneer: పాల ఉత్పత్తులలో ఒకటైన పనీర్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పనీర్ ని ఉపయోగించి అనేక రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. కాగా పనీర్‌లో ప్రోటీన్, కాల్షియం, భాస్వరం, జింక్, విటమిన్ బి12, అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయట. అయితే ప్రోటీన్ అధికంగా ఉండే పనీర్, ముఖ్యంగా వ్యాయామం చేసే వారికి చాలా మేలు చేస్తుందట. అలాగే ఇది కండరాలను బలపరచడమే కాకుండా, శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుందట.
శరీర నిర్మాణాన్ని మెరుగుపరచుకోవాలనుకునే వారికి పనీర్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. పనీర్‌లో ఉండే కాల్షియం, భాస్వరం ఎముకల బలానికి చాలా అవసరమట. వీటివల్ల ఎముకలు, పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలు, వృద్ధులు పనీర్ ను ఆహారంలో చేర్చుకుంటే ఎముకల బలహీనత, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు. పనీర్ లో ఉన్న జింక్ రోగనిరోధక శక్తిని పెంచుతుందట.
ఇది శరీరాన్ని వైరస్ లు, బ్యాక్టీరియా వంటి హానికరమైన జీవుల నుంచి కాపాడుతుందని, తరచూ జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లకు గురయ్యే వారు పనీర్ ను ఆహారంలో చేర్చుకోవడం ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు. అలాగే చాలా మందికి విటమిన్ బి12 లోపం ఉంటుంది. ఈ లోపం వల్ల అలసట, రక్తహీనత, నాడీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. పనీర్ విటమిన్ బి12కి మంచి మూలం కావడంతో ఈ లోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుందట. కాగా బరువు తగ్గాలనుకునే వారు పనీర్ ను తమ డైట్ లో చేర్చుకోవచ్చట. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉండటంతో కడుపు తొందరగా నిండిన భావన కలుగుతుందని, దీంతో అవసరానికి మించిన ఆహారం తినకుండా బరువును నియంత్రించుకోవచ్చని చెబుతున్నారు. పనీర్ లో ఉండే పోషకాలు మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయట. ఇది ఒత్తిడిని తగ్గించి మనసుకు ప్రశాంతతను అందిస్తుందట. పనీర్ ను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం ఆందోళన, టెన్షన్ తగ్గించడంలో ఉపశమనాన్ని ఇస్తుందని చెబుతున్నారు.