H Pylori Infection : అమ్మ చేతి గోరు ముద్దతో హెచ్. పైలోరీ బ్యాక్టీరియా వ్యాప్తి.. ఏమిటిది ?
హెచ్.పైలోరీ బ్యాక్టీరియా వల్ల కలిగే నష్టాలను తెలియజేసేందుకు.. ఆ బ్యాక్టీరియాను తన శరీరంలోకి ప్రొఫెసర్ బ్యారీ మార్షల్(H Pylori Infection) ఎక్కించుకున్నారు.
- Author : Pasha
Date : 09-11-2024 - 10:07 IST
Published By : Hashtagu Telugu Desk
H Pylori Infection : అమ్మ చేతి గోరు ముద్దపై నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ బ్యారీ మార్షల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనిషి జీర్ణకోశ కణజాలానికి పట్టుకొని అల్సర్ నుంచి జీర్ణాశయ క్యాన్సర్ దాకా పలు వ్యాధులకు కారణమయ్యే హెలికో బ్యాక్టర్ పైలోరీ (హెచ్. పైలోరీ) బ్యాక్టీరియా మనిషి శరీరంలోకి చేరడానికి అమ్మ చేతి గోరుముద్ద కూడా ఒక కారణమని ఆయన వాదిస్తున్నారు. భారతదేశ జనాభాలోని దాదాపు 50 నుంచి 60 శాతం మంది కడుపులో హెచ్. పైలోరీ బ్యాక్టీరియా ఉంటుందని బ్యారీ మార్షల్ చెప్పారు.భారత్‌లో మధుమేహ రోగుల కంటే 10 రెట్లు ఎక్కువగా హెచ్ పైలోరీ కేసులు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని వెస్ట్రన్ యూనివర్సిటీలో క్లినికల్ మైక్రోబయాలజీ ప్రొఫెసర్‌గా డాక్టర్ బ్యారీ మార్షల్ సేవలు అందిస్తున్నారు. 2005లో ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది.
Also Read :Car Burial Ceremony : లక్కీ కారుకు అంత్యక్రియలు.. ఖర్చు రూ.4 లక్షలు.. అంతిమయాత్రలో 1500 మంది
హెచ్.పైలోరీ బ్యాక్టీరియా వ్యాప్తి, నివారణ తదితర అంశాలపై పరిశోధనల కోసం దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ) హాస్పిటల్‌లో ప్రొఫెసర్ బ్యారీ మార్షల్ పేరిట ఒక రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దాన్ని ఇక ‘బ్యారీ మార్షల్ సెంటర్’గా పిలువనున్నారు. హెచ్.పైలోరీ బ్యాక్టీరియా వల్ల కలిగే నష్టాలను తెలియజేసేందుకు.. ఆ బ్యాక్టీరియాను తన శరీరంలోకి ప్రొఫెసర్ బ్యారీ మార్షల్(H Pylori Infection) ఎక్కించుకున్నారు. అల్సర్, జీర్ణకోశ సంబంధిత క్యాన్సర్‌ల చికిత్సలో ఆయన పరిశోధనలు విప్లవాత్మక మార్పులకు దారితీశాయి. అందుకే ఏఐజీ హాస్పిటల్‌లోని రీసెర్చ్ సెంటర్‌కు ఆయన పేరును పెట్టారు.
హెచ్.పైలోరీ బ్యాక్టీరియా గురించి..
- అపరిశుభ్రత, కలుషిత తాగునీరు తదితర కారణాలతో హెచ్.పైలోరీ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.
- ఈ బ్యాక్టీరియా ఇంట్లో ఒకరికి సోకితే మిగతా వారు కూడా దీని బారినపడే ముప్పు ఉంటుంది.
- ‘హెచ్ పైలోరీ’ సోకినప్పటికీ 80 శాతం మందిలో లక్షణాలు బయటికి కనిపించవు. ఇది ప్రమాదకరం.
- ఈ బ్యాక్టీరియా బారినపడిన కొంతమందికి అజీర్తి సమస్య వస్తుంది. పొట్టలో నొప్పిగా ఉంటుంది. తరుచుగా గ్యాస్ వస్తుంటుంది.
- ఈ బ్యాక్టీరియా బారినపడే ఒక శాతం మందికి పొట్ట క్యాన్సర్ వచ్చే ముప్పు ఉంటుంది.
- కుటుంబంలో ఎవరికైనా గతంలో క్యాన్సర్ వచ్చి ఉంటే.. మిగతావారు ఒకసారి ‘హెచ్ పైలోరీ’ బ్యాక్టీరియా పరీక్ష చేయించుకుంటే బెటర్.