Beauty Tips: ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంచే కివి.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!
కివి అందానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 01:35 PM, Mon - 11 November 24

కివి పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. కివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ బి, విటమిన్ సి, కాపర్, ఫైబర్, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న కివి రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుందట. అలాగే ఇది శ్వాసకోశ వ్యాధులను తగ్గించడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. అంతేకాదు రక్తపోటు నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి కూడా కివిలు ప్రయోజనకరంగా ఉంటాయి.
ఫైబర్ ఎక్కవుగా ఉండే కివి మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. ఈ పండులో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండును తింటే కడుపు తొందరగా నిండి మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారని చెబుతున్నారు. కివి శరీర ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకు కూడా ఎంతో మేలు చేస్తుందట. కివిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉంటాయి.
కొల్లాజెన్ అనేది మన చర్మం స్థితిస్థాపకతను నిర్వహించడానికి సహాయపడే సమ్మేళనం. కివిలో ఉండే విటమిన్ సి మీ చర్మంలో కొల్లాజెన్ సాంద్రతను పెంచుతుంది. కివి ఫేస్ ప్యాక్స్ ముఖంపై నల్లటి మచ్చలను నివారించడానికి, మొటిమలను తగ్గించడానికి, మీ చర్మం అందంగా మెరిసేలా చేయడానికి సహాయపడతాయట. మరీ ఎలాంటి ఫేస్ ప్యాక్ లు ట్రై చేయాలి అన్న విషయానికి వస్తే.. బాగా పండిన కివి పండును గుజ్జుగా చేసి దానిలో ఒక టేబుల్ స్పూన్ తేనెను కలపి, మీ ముఖం, మెడకు అప్లై చేయవచ్చు. దీన్ని 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఈ ప్యాక్ ముఖంపై మచ్చలను నివారించడానికి, ముఖాన్ని కాంతివంతంగా చేయడానికి సహాయపడుతుందట.
మరొక రెమెడీ విషయానికి వస్తే..
ఒక గిన్నెలో ఒక కివి గుజ్జును తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ పెరుగు, అరటిపండు గుజ్జును వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మెడ, ముఖానికి సమానంగా అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. పొడి చర్మం ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందట. ఇంకొక రెమెడీ విషయానికి వస్తే.. ఒక కివి పండు గుజ్జులో మూడు లేదా నాలుగు నానబెట్టిన బాదం పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ శెనగపిండిని వేసి కలపాలి. దీన్ని ముఖం, మెడకు అప్లై చేయవచ్చు. 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇది మీ చర్మాన్ని టోన్ చేయడానికి, హైడ్రేట్ చేయడానికి, రంధ్రాలను నివారించడానికి కూడా సహాయపడుతుందట. అలాగే ఒక కివి పండు పేస్ట్ లో ఒక టేబుల్ స్పూన్ ఓట్ మీల్ మిక్స్ చేసి ముఖానికి, మెడకు అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించి మీ ముఖాన్ని కాంతివంతంగా చేస్తుందట.