Eye Bleeding Fever : కలకలం రేపుతున్న వైరస్.. కళ్ల నుంచి రక్తస్రావం!
Eye Bleeding Fever : ఒక ప్రమాదకర వైరస్ కలకలం క్రియేట్ చేస్తోంది. దీని బారినపడే వారికి కళ్లు, ముక్కు, చర్మంలోని రక్తనాళాలు పగిలి రక్తస్రావం అవుతోంది.
- Author : Pasha
Date : 29-10-2023 - 1:09 IST
Published By : Hashtagu Telugu Desk
Eye Bleeding Fever : ఒక ప్రమాదకర వైరస్ కలకలం క్రియేట్ చేస్తోంది. దీని బారినపడే వారికి కళ్లు, ముక్కు, చర్మంలోని రక్తనాళాలు పగిలి రక్తస్రావం అవుతోంది. ఫలితంగా వైరస్ బాధితులకు కళ్లు తిరగడం, కళ్లు ఎర్రబారడం, వెలుగును చూడలేకపోవడం, జ్వరం, గొంతులో మంట, మెడ నొప్పి, వెన్ను నొప్పి, తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు, కండరాల నొప్పి వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ (సీసీహెచ్‌ఎఫ్) అనే పేరు కలిగిన ఈ వైరల్ వ్యాధికి సంబంధించిన కేసులు ఫ్రాన్స్-స్పెయిన్ సరిహద్దుల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే ఈ కేసులు వ్యాపించే ముప్పు ఉండటంతో.. పొరుగునే ఉన్న యూకే దేశం కూడా అలర్ట్ అయింది. ఫ్రాన్స్‌లోని క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ ప్రభావిత ప్రాంతాలకు రాకపోకలు సాగించేవారు జాగ్రత్తలు తీసుకోవాలని తన పౌరులకు యూకే సూచించింది. ప్రస్తుత వాతావరణ మార్పుల కారణంగా ఈ వైరస్ మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ముప్పు ఉందని బ్రిటన్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్.. హయలోమా మార్గినాటమ్ అనే విష పురుగు కుట్టడం వల్ల వస్తుంది. ఈ పురుగులను పైరీనీస్ ఓరియంటల్స్ ప్రాంతంలోని పశువులలో గుర్తించారు. వ్యాధిగ్రస్తుల శరీర ద్రవాల ద్వారా కూడా ఈ వైరస్ ఇతరులకు సోకుతుంది. ప్రస్తుతానికి ఈ ఫీవర్‌కు ఔషధాలు, చికిత్సలు, టీకాలు అందుబాటులోకి రాలేదు. దీని బారినపడే వారికి రోగనిరోధకశక్తిని పెంచేందుకు మాత్రమే ఔషధాలను అందిస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం 2016 నుంచి 2022 మధ్య ప్రపంచవ్యాప్తంగా కేవలం 7 క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ కేసులు కేసులు నమోదయ్యాయి. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే దీని బారినపడే వారిలో 10 నుంచి 40 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. సాధారణంగా ఈ వైరస్‌కు సంబంధించిన కేసులు ఆఫ్రికా, పశ్చిమాసియా తదితర ప్రాంతాల్లో ఎక్కువగా (Eye Bleeding Fever) కనిపిస్తుంటాయి.