Fact Check : సునితా విలియమ్స్ అంతరిక్షంలో ఖురాన్ చదివారా ?
క్రూ-9 మిషన్‌లో భాగంగా 2025 మార్చి 19న SpaceXకు చెందిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సునితా విలియమ్స్ సహా పలువురు వ్యోమగాములు(Fact Check) భూమికి తిరిగి చేరుకున్నారు.
- By Pasha Published Date - 06:26 PM, Tue - 25 March 25

Fact Checked By Factly
ప్రచారం : అంతరిక్షంలో ఉన్న టైంలో ఖురాన్ చదవడం వల్ల తనకు ధైర్యం వచ్చిందని సునితా విలియమ్స్ ‘బీబీసీ’కి తెలిపారు.
వాస్తవం : ఈ ప్రచారం అవాస్తవం. సునితా విలియమ్స్ బీబీసీతో ఈవిధంగా చెప్పినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. కాబట్టి వైరల్ అవుతున్న పోస్ట్‌లోని క్లెయిమ్ తప్పు.
నాసాకు చెందిన భారత సంతతి వ్యోమగామి సునితా విలియమ్స్ దాదాపు 9 నెలలు పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో గడిపారు. క్రూ-9 మిషన్‌లో భాగంగా 2025 మార్చి 19న SpaceXకు చెందిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సునితా విలియమ్స్ సహా పలువురు వ్యోమగాములు(Fact Check) భూమికి తిరిగి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తాను అంతరిక్షంలో ఉన్న టైంలో ఖురాన్ చదివానని, దాని నుంచి ఎంతో ధైర్యాన్ని, స్ఫూర్తిని పొందానని బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునితా విలియమ్స్ చెప్పినట్లుగా ఒక పోస్టు (ఆర్కైవ్) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే విషయాన్ని నిర్థారించాలని కోరుతూ మా వాట్సాప్ టిప్‌లైన్‌కు (+91 9247052470) పలు అభ్యర్ధనలు వచ్చాయి. ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం.

వాస్తవ తనిఖీలో గుర్తించిన అంశాలివీ..
- ముందుగా మేం వైరల్ పోస్టులోని సమాచారం గురించి ఇంటర్నెట్లో వెతికాం. అయితే బీబీసీ ఈ సమాచారాన్ని ప్రచురించినట్లు మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు.
- సునితా విలియమ్స్ భూమిపైకి చేరుకోగానే న్యూస్ కాన్ఫరెన్స్ ఉంటుందని అందరూ భావించారు. కానీ ఆ న్యూస్ కాన్ఫరెన్స్ జరిగితే లైవ్‌లో ప్రసారం చేద్దామని బీబీసీ భావించింది. అయితే సుదీర్ఘ కాలం తర్వాత భూమికి తిరిగి వచ్చినందున సునితా విలియమ్స్‌కు వైద్యపరీక్షలు చేయాల్సి ఉందని నాసా ప్రకటించింది. అందువల్ల న్యూస్ కాన్ఫరెన్స్ పెట్టడం లేదని వెల్లడించింది. ఈమేరకు వివరాలతో బీబీసీ మార్చి 19న ఉదయం 6 గంటల 4 నిమిషాలకు ఒక వార్తను ప్రచురించింది. ఆ వార్తా కథనం (ఆర్కైవ్)ను ఇక్కడ మీరు చూడొచ్చు.
- అంతరిక్షంలో ఉన్న టైంలో సునితా విలియమ్స్, నాసా అధికారులు వివిధ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాటిలో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) కూడా సునితా విలియమ్స్ రంజాన్ స్పూర్తితో ఉపవాసం ఉంటున్నట్లు చెప్పలేదు.
- మీడియా కథనాల ప్రకారం.. సునితా విలియమ్స్ 2024లో అంతరిక్షానికి వెళ్లేటప్పుడు గణేశుడి ప్రతిమని తీసుకెళ్లారని ఆమె సోదరి ఫల్గుణి పాండ్య పేర్కొన్నారు.
- 2013లో మీడియా సమావేశంలో సునితా విలియమ్స్ మాట్లాడుతూ.. తాను 2012లో అంతరిక్షంలోకి వెళ్లేటప్పుడు గణేశుడి ప్రతిమ, భగవద్గీత, ఉపనిషత్తులను తీసుకెళ్లానని వెల్లడించారు.

మొత్తం మీద.. అంతరిక్షంలో తాను ఖురాన్ నుంచి స్పూర్తిని పొందానని సునితా విలియమ్స్ బీబీసీతో చెప్పినట్టుగా ఆధారాలు లేవు. అటువంటి వివరాలతో వార్తా కథనాన్ని బీబీసీ ప్రచురించలేదు.