Dussehra: దసరా రోజు జమ్మి చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
Dussehra: దసరా పండుగా రోజున జమ్మి చెట్టు ఆకులను ఇంటికి ఎందుకు తెచ్చుకుంటారు. దని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:00 AM, Tue - 30 September 25

Dussehra: హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దసరా కూడా ఒకటి. దాదాపు తొమ్మిది రోజులపాటు ఈ పండుగను చాలా ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ నవరాత్రుల సమయంలో అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. నవరాత్రుల తర్వాత ఆయుధ పూజా దసరా పండుగ నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ పండుగను ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా దసరా పండుగ రోజు జమ్మి చెట్టును పూజించి జమ్మి ఆకుల్ని అందరికీ పంచి పెడుతూ ఉంటారు.
పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఇంతకీ దసరా పండుగ రోజు జమ్మి చెట్టు ఆకులను ఎందుకు పూజిస్తారో, దానికి వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దసరా పండుగను చెడుపై మంచికి సంకేతంగా భావిస్తారు. ఈ పండుగ శుభారంభానికి, విజయానికి నాందిగా చెబుతుంటారు. ఈ పండుగకు మనం ఎన్నో ఆచారాలను కూడా పాటిస్తుంటాం. ముఖ్యంగా ఈ పండుగ పర్వదినాన పాలపిట్టను చూడటం, జమ్మి ఆకుల్ని ఇంటికి తెచ్చుకోవడం ఎన్నో ఏండ్ల నుంచి వస్తోన్న సంప్రదాయం. చాలా మంది జమ్మి ఆకుల్ని ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకోవడం, ఇంటికి తెచ్చి పెద్దవారికి ఇవ్వడం, దేవుడి గుడిలో పెట్టడం చేస్తుంటారు.
అయితే నిజానికి దసరా నాడు జమ్మి చెట్టును పూజించడం వెనుక ఒక ఆధ్యాత్మిక కథే ఉంది. మహాభారతంలో పాండవులు తమ అజ్ఞాతవాసం సమయంలో వారి ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచిపెట్టారని చెప్తారు. వీరి అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత జమ్మిచెట్టు మీద ఉన్న ఆయుధాలను తీసుకెళ్లి కౌరవులతో యుద్దం చేశారు. ఆ యుద్ధంలో వారు విజయం సాధించినందుకు జమ్మి చెట్టును విజయానికి సంకేతంగా భావిస్తారు. అయితే దసరా పండుగ నాడు ఉదయాన్నే తలస్నానం చేసి దేవుళ్లకు పూజ చేయాలి. ఆ తర్వాత జమ్మి చెట్టు దగ్గరికి వెళ్లి నమస్కరించి కుంకుమ, పసుపులను సమర్పించాలి. తర్వాత దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఆకులను తీసుకోవాలి.
చెట్టు నుంచి తీసుకున్న ఆకులను బంగారంగా భావించి పండుగ నాడు ఫ్రెండ్స్ కు, ఇరుగుపొరుగు వారికి బంధువులకు ఇస్తారు. ఈ ఆకులను ఇలా పంచిపెట్టడాన్ని సువర్ణ దానం అని అంటారు. ఇలా దానం చేయడాన్ని ఐశ్వర్యానికి, ఆర్థికాభివృద్ధికి సంకేతంగా భావిస్తారు. ఈ ఆకులు శాంతిని, ధైర్యాన్ని, విజయాన్ని సూచిస్తాయి. జమ్మి సహనానికి, క్రమశిక్షణకు చిహ్నంగా కూడా బావిస్తారు. అయితే దసరా పండుగ నాడు జమ్మి చెట్టు ఆకుల్ని పూజించడం ఒక పవిత్ర ఆచారం. ఇది ఒక సాంప్రదాయం మత్రమే కాదు ప్రకృతిని గౌరవించడం కూడా అవుతుందని, ఆకులను బంగారంగా భావించి ఇచ్చిపుచ్చుకోవడమంటే సంతోషాలను, సఖ్యతను, ఐశ్వర్యం ను పంచుకోవడం అవుతుందని చెబుతున్నారు.