Brahma Muhurtham: బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి? ఎప్పుడు వస్తుంది?
సాధారణంగా మనం ఏవైనా పూజలు (Pujas), వ్రతాలు చేసేటప్పుడు బ్రహ్మ ముహూర్తంలో
- Author : Vamsi Chowdary Korata
Date : 20-02-2023 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
సాధారణంగా మనం ఏవైనా పూజలు, వ్రతాలు చేసేటప్పుడు బ్రహ్మ ముహూర్తం (Brahma Muhurtham) లో చేయాలి అనే పదాన్ని వినే ఉంటాం. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి? చిన్నప్పటి నుంచి ఈ పదాన్ని ఎక్కువ సార్లు వింటూ ఉన్నా దీనికి సరైన అర్థం మాత్రం చాలామందికి తెలియదు. పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే ‘బ్రహ్మముహూర్తం’ అంటారు.
అంటే రోజు మొత్తంలో 29 వది బ్రహ్మ ముహూర్తం (Brahma Muhurtham). ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, 98 – 48 నిమిషాల మధ్యకాలం ఇది. నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. పురాతన కాలంలో హిందూ పవిత్ర గ్రంథాల ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో మేల్కొలనాలని ఉంది. ఎప్పుడు లేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఆయుర్వేద శాస్త్రంలో వివరంగా ఉంది. మన పెద్దవాళ్లు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేవడం మంచిది అని చెప్తారు.
విద్యార్థులు బ్రహ్మ ముహూర్తంలో ఏదైనా చదివితే వారికి ఎలాంటి క్లిష్టమైన విషయం అయినా సులభంగా అర్థం అవుతుంది. ఎక్కువకాలం గుర్తుంచుకుంటారు అని గురువులు తరచూ సూచిస్తారు. అంతేకాకుండా ప్రతిరోజు బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతారు. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవటం వల్ల సూర్యుడి నుంచి వెలువడే లేలేత కిరణాలు మనపై ప్రచురించడం వల్ల అధిక మొత్తంలో విటమిన్ డి శరీరానికి పొందవచ్చు.ఈ సమయంలో వాతావరణంలోని ఆక్సిజన్ స్వచ్ఛంగా ఉంటుంది. రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే పడుకోవడం కూడా తొందరగానే అలవడుతుంది. దీంతో నిద్ర లేమి సమస్య పోవడమే కాకుండా క్రమశిక్షణ కూడా అలవడుతుంది.
Also Read: Baldness Tips: బట్టతలకు, జుట్టు రాలే ప్రాబ్లమ్ కు ఇంటి చిట్కాలు