Karthika Masam: కార్తీక మాసంలో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదో మీకు తెలుసా?
Karthika Masam: త్వరలోనే కార్తీక మాసం ప్రారంభం కానుంది. అయితే ఈ కార్తీకమాసంలో ఎటువంటి పనులు చేయాలి? ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయాల గురించి పండితులు ఏమంటున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:00 AM, Thu - 16 October 25

Karthik Masam: కార్తీక మాసం పరమేశ్వరుడికి అలాగే మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం అన్న విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం ఈ కార్తీకమాసం దీపావళి పండుగ తర్వాత మొదలవుతూ ఉంటుంది. అలాగే ఈ ఏడాది అక్టోబర్ 20న దీపావళి పండుగ జరుపుకోనున్నారు. అనంతరం అక్టోబర్ 21 నుంచి కార్తీక మాసం మొదలు కానుంది. వచ్చే నెల అనగా నవంబర్ 20వ తేదీన ఈ కార్తీకమాసం ముగుస్తుంది. అయితే ఈ మాసంలో చేయాల్సినవి చేయకూడనివి కొన్ని రకాల పనులు ఉన్నాయని చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కార్తీకమాసంలో సూర్యోదయానికి ముందే నిద్ర లేచి పవిత్ర నదుల్లో లేదా కనీసం పారుతున్న నీటిలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదం అని చెబుతున్నారు. నదీ స్నానం సాధ్యం కాకపోతే, ఇంటి వద్ద ఉన్న నీటిలో కొద్దిగా గంగాజలం లేదా పసుపు కలుపుకుని స్నానం చేయవచ్చట. ఇది సకల పాపాలను తొలగిస్తుందని చెబుతున్నారు. కార్తీక మాసంలో దీపారాధనకు అత్యంత ప్రాధాన్యత ఉంది. శివాలయంలో విష్ణు ఆలయంలో లేదా ఇంట్లో తులసి కోట వద్ద దీపం వెలిగించడం శుభకరం. సాయంత్రం వేళ ఆలయాల్లో లేదా నదీ తీరాల్లో దీపాలను వదిలిపెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెబుతున్నారు.
ఈ మాసం శివకేశవులకు ప్రీతికరమైనది కాబట్టి ప్రతిరోజు శివాలయాన్ని సందర్శించి శివుడికి బిల్వపత్రాలు సమర్పించాలని రుద్రాభిషేకం చేయించడం వల్ల కూడా పుణ్యం లభిస్తుందని చెబుతున్నారు. కార్తీక సోమవారాలకు, కార్తీక పౌర్ణమికి ప్రత్యేక పూజలు చేయాలని పండితులు చెబుతున్నారు. తులసి దేవికి ప్రతిరోజూ దీపం వెలిగించి, పూజించడం వలన అఖండ సౌభాగ్యం కలుగుతుందట. ఇకపోతే కార్తీక మాసంలో చేయకూడని పనుల విషయానికి వస్తే.. కార్తీక మాసం మొత్తం మాంసాహారం, మద్యం, ఇతర ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు.
వీలైనంత వరకు ఈ మాసంలో నేలపై లేదా చాపపై మాత్రమే నిద్రించడం మంచిదట. ఇది శారీరక సుఖాలకు దూరంగా ఉండి, ఆధ్యాత్మిక చింతనకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని సూచిస్తుందని చెబుతున్నారు. అలాగే ఈ మాసంలో ఇతరులను నిందించడం, నిష్ఠూరంగా మాట్లాడటం లేదా అబద్ధాలు చెప్పడం వంటివి చేయకూడదట. మనస్సు, మాట, కర్మల శుద్ధికి ప్రయత్నించాలట. కార్తీక మాసంలో రోజువారీ తైల అభ్యంగనం మానేయడం మంచిది అని చెబుతున్నారు. ఈ మాసంలో ఉల్లి, వెల్లుల్లి, వంకాయ వంటి తామస గుణం ఉన్న ఆహారాలను పూర్తిగా వదిలేయడం మంచిది అని చెబుతున్నారు.