Tulasi Vivaham: ఈ ఏడాది తులసి వివాహం ఎప్పుడు.. తేదీ సమయం పూజా విధానం వివరాలు ఇవే!
తులసి వివాహం జరుపుకోవడం వల్ల కలిగే ఫలితాల గురించి పండితులు తెలిపారు.
- By Anshu Published Date - 11:00 AM, Mon - 4 November 24

కార్తీక మాసంలో తులసి దేవి, శ్రీమహావిష్ణువుల వివాహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలోని ద్వాదశి రోజున తులసి కళ్యాణం నిర్వహిస్తారు. ఈ రోజు నుండి అన్ని శుభ కార్యాలు మళ్లీ ప్రారంభం అవుతాయి. ఈ రోజున, తల్లి తులసి , శ్రీమహా విష్ణువు రూపమైన శాలిగ్రాముల వివాహం హిందువులు తమ ఇళ్లలో నిర్వహించుకోవడంతో పాటు, దేవాలయాలలో కూడా జరుపుతారు. కార్తీక మాసం ద్వాదశి తిథి మంగళవారం, నవంబర్ 12 సాయంత్రం 4:02 గంటలకు ప్రారంభమవుతుంది. ముగింపు తేదీ నవంబర్ 13 బుధవారం మధ్యాహ్నం 1:01 గంటలకు ఉంటుంది.
సాయత్రం పూజ ను పరిగణలోకి తీసుకుంటే నవంబర్ 12న తులసి వివాహం జరపనుండగా ఉదయ తిథి లెక్క ప్రకారం నవంబర్ 13న తులసి వివాహాన్ని జరుపుకుంటారు. తులసి వివాహం కోసం, ఒక పీటం మీద ఆసనాన్ని పరచి తులసి మొక్కను, శాలిగ్రామ విగ్రహాన్ని ప్రతిష్టించాలి. ఆ తర్వాత పీటం చుట్టూ చెరకుతో మంటపాన్ని ఏర్పాటు చేసి ఆ మండపాన్ని అలంకరించి కలశాన్ని ప్రతిష్టించాలి. ముందుగా కలశాన్ని, గౌరీ గణేశుడిని పూజించాలి. అప్పుడు తులసి మొక్కకు, శాలిగ్రామ స్వామికి ధూపం, దీపం, వస్త్రాలు, దండలు, పువ్వులు సమర్పించాలి. ఆ తర్వాత తులసి సౌభాగ్య సూచన అయిన పసుపు , కుంకుమ, వంటి వస్తువులతో పాటు ఎరుపు రంగు చున్నీని అందించాలి. పూజ అనంతరం తులసి మంగళాష్టకం పఠించడం మంచిది.
ఆ తరువాత శాలిగ్రామంతో తులసికి ఏడు ప్రదక్షిణలు చేయాలి. ఈ ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత విష్ణువు,తులసికి హారతి ఇవ్వాలి. పూజ అనంతరం ప్రసాదం పంచిపెట్టడం మంచిది. ఈరోజున తులసి వివాహం జరిపించడం వల్ల జీవితంలో ఏదైనా అడ్డంకులు ఉంటే తొలగిపోతాయట. తులసి వివాహం సమయంలో తులసి మొక్కకు అలంకరణ వస్తువులు సమర్పించడం వలన అఖండ సౌభాగ్యాలు కలుగుతాయట. తులసి వివాహం రోజున సాయంత్రం వేళ రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని దారిద్ర్యం తొలగిపోయి సుఖ సంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయట. తులసి వివాహం రోజున తులసి మొక్కకు ఏడు సార్లు ప్రదక్షిణ చేసి, సంధ్యా సమయంలో నెయ్యి దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందట..