TTD : తిరుమల వెళ్లే భక్తులు ఇకపై వసతుల కోసం చింతించాల్సిన అవసరం లేదు..ఎందుకంటే !
TTD : పలు పాత భవనాలను ఆధునిక సదుపాయాలతో మరమ్మతులు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని టీటీడీ ఈవో జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు.
- By Sudheer Published Date - 08:19 AM, Sat - 19 July 25

తిరుమల శ్రీవారి(Tirumala Srivaru)ని దర్శించేందుకు వచ్చే భక్తులు ఇకపై వసతుల కోసం చింతించాల్సిన అవసరం లేదు. భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) యాజమాన్యం కసరత్తులు మొదలుపెట్టింది. ఈ దిశగా పలు పాత భవనాలను ఆధునిక సదుపాయాలతో మరమ్మతులు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని టీటీడీ ఈవో జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. ప్రత్యేకంగా అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద ఉన్న భవనాన్ని అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి పరిశీలించారు.
ఇక హెచ్‌వీడీసీ, బాలాజీ నిలయం, తిరుమల మందిరం ప్రాంతంలోని విశ్రాంతి గృహాలను కూడా పరిశీలించి, వాటి పునర్నిర్మాణం లేదా మరమ్మతులకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ సత్యనారాయణ, ఈఈ వేణుగోపాల్, డిప్యూటీ ఈవో భాస్కర్ తదితర అధికారులు పాల్గొన్నారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో తిరుమలలో ప్రాతినిధ్యం వహించే అన్ని భవనాల వాడకాన్ని సమీక్షించి, అవసరమైన చోట మరింత మెరుగులు దిద్దేందుకు టీటీడీ సిద్ధమవుతోంది.
Cranberries : ఆరోగ్యానికి క్రాన్‌బెర్రీలు..ఇవి తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..?
ఇక తిరుపతి సమీపంలోని పేరూరు బండ వద్ద ఉన్న వకుళమాత ఆలయం భక్తుల రాకపోకలతో అలమడుతోంది. ఈ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు తెలిపారు. శుక్రవారం ఆలయాన్ని సందర్శించిన ఆయన, క్యూ లైన్లు, భక్తులకు అందుతున్న సౌకర్యాలు పరిశీలించి, అవసరమైన అభివృద్ధి పనులపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో చేపట్టాల్సిన పనులను టీటీడీ బోర్డు ముందుంచి ఆమోదం తీసుకోవాలని తెలిపారు.
శనివారం తిరుపతిలోని కపిలేశ్వర స్వామివారి ఆలయానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో, ఈవో శ్యామలరావు ఆలయంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. క్యూలైన్లు, పార్కింగ్, పుష్కరిణి, జలపాతం ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య అధికారులు పాల్గొన్నారు. మొత్తం మీద తిరుమలలో భక్తులకు అన్ని విధాల వసతులు కల్పించేందుకు టీటీడీ యాజమాన్యం తీవ్రంగా కృషి చేస్తోంది.