Matangeshwar Temple : ఏటా పెరుగుతున్న శివలింగం..ఎక్కడుందా ఆలయం? విశేషాలేంటి? తెలుసుకుందాం!
మాతంగేశ్వర ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ? ఇది శిల్పాలకంటే ఎక్కువగా ఒక మర్మమైన రహస్యాన్ని కలిగివుంది. ఈ ఆలయంలో ఉన్న శివలింగం కింద భూమిలో 18 అడుగుల లోతున విలువైన నిధి దాగి ఉందని స్థానికుల నమ్మకం. దీన్ని సాధారణంగా కాదు, ఋషులు మరియు దైవిక శక్తులు స్వయంగా కాపాడుతున్నారంటారు.
- By Latha Suma Published Date - 02:50 PM, Mon - 16 June 25

Matangeshwar Temple : మన దేశం ఆధ్యాత్మిక సంపదకు నిలయంగా నిలుస్తోంది. అనేక ఆలయాలు, పురాతన నిర్మాణాలు, రహస్యాలతో ముడిపడి ఉన్న శిల్పకళలు ఇవన్నీ భారతీయ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచాయి. అలాంటి చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఆలయాల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖజురాహోలో ఉన్న మాతంగేశ్వర మహాదేవ ఆలయం ఒకటి. ఇది పర్యాటక దృష్ట్యా, ఆధ్యాత్మిక విశిష్టతల పరంగా కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. ఖజురాహో అంటేనే మనసుకు హత్తుకునే శిల్పసంపద. కానీ మాతంగేశ్వర ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ? ఇది శిల్పాలకంటే ఎక్కువగా ఒక మర్మమైన రహస్యాన్ని కలిగివుంది. ఈ ఆలయంలో ఉన్న శివలింగం కింద భూమిలో 18 అడుగుల లోతున విలువైన నిధి దాగి ఉందని స్థానికుల నమ్మకం. దీన్ని సాధారణంగా కాదు, ఋషులు మరియు దైవిక శక్తులు స్వయంగా కాపాడుతున్నారంటారు.
Read Also: Tirumala : శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్
ఇక్కడి శివలింగం గురించి మరొక విస్మయకర విషయం ఏమిటంటే? అది ప్రతి సంవత్సరం కాస్త కాస్త పెరుగుతూ ఉంటుందని భక్తులు చెబుతున్నారు. శాస్త్రీయంగా ఈ విషయం నిర్ధారించలేకపోయినప్పటికీ, ఇది దేవుని లీలగా, యుగ ధర్మానుగుణంగా జరుగుతున్న పరిణామంగా కొంతమంది భావిస్తారు. ఇంకొందరైతే ఇది భౌగోళిక స్వభావం కారణంగా జరుగుతోందని అభిప్రాయపడుతున్నారు. కానీ ఇప్పటికీ ఈ విచిత్రమైన సంఘటనపై స్పష్టమైన సమాధానం లేదు. మాతంగేశ్వర మహాదేవ ఆలయం ఖజురాహోలోని పశ్చిమ దేవాలయాల సమీపంలో ఉంది. ఇది 9వ శతాబ్దం చివరి నుండి 10వ శతాబ్దం మధ్య కాలంలో చందేలా వంశ పాలకులు నిర్మించారని చరిత్రకారుల అభిప్రాయం. ఖజురాహోలోని ఇతర దేవాలయాల్లాగే ఇది కూడా నాగర శైలిలో నిర్మించబడింది. అయితే మిగిలిన ఆలయాలతో పోలిస్తే ఇది ఒకే ఆలయం పనిచేస్తూ ఉందన్నది ప్రత్యేకత.
ఈ ఆలయంలోని శివలింగం ప్రస్తుతం 9 అడుగుల ఎత్తులో ఉంది. ఒక పురాణ ప్రకారం, ఈ శివలింగం 18 అడుగుల ఎత్తుకి చేరితే యుగాంతం సంభవిస్తుందని ప్రచారం ఉంది. ఇది కేవలం ఒక నమ్మకమే అయినా, భక్తులు తరతరాలుగా దీనిని విశ్వసిస్తూ వస్తున్నారు. ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. శివకళ్యాణం రోజున దేశం నలుమూలల నుంచి వచ్చిన 25,000 మందికి పైగా భక్తులు హాజరవుతారు. శివలింగానికి అభిషేకం చేసి వరుడిలా అలంకరించడం, శోభాయాత్రలు, ధార్మిక ప్రవచనాలు, సంప్రదాయ నృత్య, సంగీత కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు దాదాపు 10 రోజుల పాటు కొనసాగుతాయి. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చే భక్తులు దగ్గర్లో ఉన్న ఇతర ముఖ్య దేవాలయాలను కూడా సందర్శిస్తారు. లక్ష్మణ దేవాలయం, వరాహ మందిరం, పార్వతీ ఆలయం, లక్ష్మీ మందిరం, ప్రతాపేశ్వర ఆలయం, విశ్వనాథ ఆలయం వంటి చారిత్రక కట్టడాలు, పురావస్తు మ్యూజియం కూడా ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. మొత్తంగా చూస్తే, మాతంగేశ్వర మహాదేవ ఆలయం కేవలం ఒక భక్తిశ్రద్ధల కేంద్రంగా కాకుండా, అనేక మర్మాలను మాయాజాలంలా మోసుకుపోతున్న చారిత్రక మణిగా నిలుస్తోంది.
Read Also: Jr. Artist : ప్రేమ పేరుతో జూ.ఆర్టిస్ట్ ను మోసం చేసిన జిమ్ ట్రైనర్.. 15 లక్షలు స్వాహా