Lord shiva: శివాలయానికి వెళ్తున్నారా.. ఈ ఒక్క పని చేస్తే చాలు.. మీ కోరికలు నేరవేరడం ఖాయం!
Lord Shiva: శివాలయానికి వెళ్లేవారు కోరికలు తొందరగా నెరవేరాలి అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క పని చేస్తే చాలు అని చెబుతున్నారు పండితులు. ఇంతకీ శివాలయానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:00 AM, Sat - 22 November 25
Lord Shiva: వారంలో సోమవారం రోజు పరమేశ్వరుడికి అంకితం చేయబడింది. అందుకే ఈరోజున అందరూ శివుడిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడు శివాలయానికి వెళ్లినా కూడా మొదట దర్శించుకునేది నందీశ్వరుడిని. నంది రెండు కొమ్ముల మధ్యలో నుంచి పరమేశ్వరుని దర్శించుకుంటూ ఉంటారు. అలాగే కొందరు వారి కోరికలను కష్టాలను నందీశ్వరుడు చెవిలో చెప్పుకొని బాధపడుతూ ఉంటారు. ఇలా నంది చెవిలో చెబితే ఆయన పరమేశ్వరుడికి చెబుతాడని తొందరగా కోరికలు నెరవేరుతాయి అని కష్టాలు తీరతాయి అని నమ్మకం. అయితే మరి నిజంగానే నంది చెవిలో చెబితే కోరికలు నెరవేరుతాయా ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కాగా పూర్వం శిలాదుడనే రుషి ఉండేవారు. ఎంత జ్ఞానాన్ని సాధించినా, ఎంతటి గౌరవాన్ని సంపాదించినా, ఆయనకు సంతానం లేకపోవడం లోటుగా ఉండేది. శిలాదుడు తనకు సంతాన భాగ్యం కలిగించమని కోరుతూ పరమశివుని కోసం తపస్సు చేశాడు. ఎన్నో వేల సంవత్సరాలు గడిచిపోయాయి, కానీ శిలాదుని తపస్సు ఆగలేదు. చివరకు ఒంటినిండా చెదలు పట్టినా శిలాదుని నిష్ఠ తగ్గలేదు. చివరకు పరమశివుడు శిలాదుని తపస్సుకు మెచ్చి అతని ఎదుట ప్రత్యక్షం అవ్వగా శిలాదుడు తనకు అయోనిజుడయిన కుమారుడిని కలుగజేయమని కోరుకున్నాడు. అతని భక్తికి పరవశించిన పరమేశ్వరుడు తథాస్తు అంటూ వరాన్ని అనుగ్రహించాడు. శివుని నుంచి వరాన్ని పొందిన శిలాదుడు సంతానం కోసం యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా, ఆ యోగాగ్ని నుంచి ఒక బాలుడు ప్రభవించాడు. శిలాదుడు సంతోషంతో ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు.
నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థమట. యోగాగ్ని నుంచి జన్మించిన నంది జననం ఎంత గొప్పదో అతని మేథ కూడా అంత అసాధారణంగా ఉండేది. చిన్నతనంలోనే సకల వేదాలను ఔపోసన పట్టేశాడట. ఒకరోజు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరుణులు అనే దేవతలు వచ్చారు. ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి మురిసిపోయారు. ఆ పిల్లవాడు తమకి చేసిన అతిథి సత్కారాలకు పరవశించి పోయారు. వెళ్తూ వెళ్తూ దీర్ఘాయుష్మాన్భవ అని అశీర్వదించబోయి ఒక్క నిమిషం ఆగిపోవడంతో నంది వంక దీక్షగా చూసి మిత్రావరుణులు ఎందుకలా బాధలో మునిగిపోయారో శిలాదునికి అర్థం కాలేదట. ఎంతగానో ప్రాథేయపడిన తరువాత నంది ఆయుష్షు త్వరలోనే తీరిపోనుందని తెలుసుకున్నాడు శిలాదుడు. నంది భవిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు విచారంలో మునిగిపోగా, నంది మాత్రం తొణకలేదు, బెణకలేదట. శివుని అనుగ్రహంతో పుట్టినవాడిని కాబట్టి, దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు అంటూ శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది. నంది తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివయ్యని చూసిన నందికి నోట మాట రాలేదట. ఆయన పాదాల చెంత ఉండే అదృష్టం లభిస్తే ఎంత బాగుండో కదా అనుకున్నాడు. అందుకే తన ఆయుష్షు గురించో, ఐశ్వర్యం గురించో వరం కోరుకోకుండా కలకాలం నీ చెంతనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామీ’ అని శివుని వేడుకున్నాడు నంది. అలాంటి భక్తుడు తన చెంతనుంటే శివునికి కూడా సంతోషమే కదా! అందుకే నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండిపొమ్మంటూ అనుగ్రహించాడు. అందుకే నంది చెవిలో చెప్పే విషయాలు శివుడికి చేరతాయని కోరికలు తొందరగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం.