Prabodhini Ekadashi : ఇవాళ ‘ప్రబోధిని ఏకాదశి’.. దీని విశిష్ఠత, పూజా విధానం వివరాలివీ
అందుకే ప్రబోధిని ఏకాదశి(Prabodhini Ekadashi) నాడు కదంబ వృక్షానికి పూజలు చేస్తారు.
- By Pasha Published Date - 10:25 AM, Tue - 12 November 24

Prabodhini Ekadashi : ఇవాళ (నవంబరు 12) ‘ప్రబోధిని ఏకాదశి’. దీన్నే దేవ ఉత్థాన ఏకాదశి అని కూడా పిలుస్తారు. దేవ శయన ఏకాదశి రోజున యోగనిద్రకు ఉపక్రమించే విష్ణు భగవానుడు .. ప్రబోధిని ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొంటారు. అందుకే ప్రబోధిని ఏకాదశి ప్రత్యేకమైన రోజు. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్యపై శయనించారు.
కదంబ వృక్షం కింద..
ఈరోజున కొన్ని నియమాలను పాటిస్తే విష్ణు భగవానుడి అనుగ్రహాన్ని భక్తులు పొందొచ్చు. కదంబ వృక్షం దేవతా వృక్షం. విష్ణు భగవానుడి అవతారమైన శ్రీకృష్ణుడికి కదంబ వృక్షం లేదా కడిమి చెట్టు అంటే చాలా ఇష్టం. శ్రీ కృష్ణుడి కోసం గోపికలు వెతుకుతుండగా.. ఆయన కదంబ వృక్షం కింద వేణువు వాయిస్తూ కనిపించారట. అందుకే ప్రబోధిని ఏకాదశి(Prabodhini Ekadashi) నాడు కదంబ వృక్షానికి పూజలు చేస్తారు. కదంబ వృక్షానికి కొద్దిగా పసుపు, కొన్ని పువ్వులతో పూజ చేయాలి. ఇలా చేస్తే అదృష్టం వరిస్తుందని నమ్ముతారు.
Also Read :Bitcoin Price : రేటుకు రెక్కలు.. ఒక్క బిట్ కాయిన్ రూ.75 లక్షలు
పూజా విధానం ఇదీ..
- వాస్తవానికి ప్రబోధిని ఏకాదశి తిథి నవంబర్ 11న (సోమవారం) మధ్యాహ్నం 2:45 గంటలకు ప్రారంభమైంది. ఈ తిథి ఈ రోజు (నవంబర్ 12) మధ్యాహ్నం 12:25 గంటలకు ముగుస్తోంది.
- సూర్యోదయంతో తిథి ఉన్న నవంబర్ 12వ తేదీనే ప్రబోధిని ఏకాదశి జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి 11 గంటల మధ్య విష్ణు భగవానుడికి పూజ చేయొచ్చు.
- ఇవాళ ఏకాదశి వ్రతం ఆచరించే వారు రోజంతా ఉపవాసం ఉండాలి. విష్ణువును తులసి మాలలతో పూజించాలి.
- ఈ రోజున బ్రహ్మాది దేవతలు తమ కీర్తనలు, భజనలు, హారతులతో శ్రీమహావిష్ణువును నిద్ర లేపుతారు. అందుకే ఈ రోజున శ్రీ మహావిష్ణువుకు హారతి ఇచ్చే భక్తులకు అపమృత్యు దోషం తొలగిపోతుందని నమ్ముతారు.
- ఇవాళ రాత్రంతా పురాణం కాలక్షేపం చేస్తూ జాగరణ చేయాలి. మర్నాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణు పూజ చేసి భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి.
- పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటి రెట్ల ఫలం ఈ వ్రతం చేసినవారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు అన్నట్లుగా నారద పురాణంలో ప్రస్తావన ఉంది.