Pahalgam: పహల్గంలోని మామలేశ్వర్ ఆలయం గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. అమర్‌నాథ్ దర్శనం కంటే ముందు ఈ ఆలయ దర్శనం!
పహల్గంలో ఉన్న మామలేశ్వర్ ఆలయం గురించి ఆలయ విశిష్టత గురించి, ఆలయ చరిత్ర గురించి, ఈ ఆలయంలో ఉన్న పరమేశ్వరుడి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 11:06 AM, Wed - 30 April 25

పహల్గాంలోని మామలేశ్వర్ ఆలయం కాశ్మీర్ లోయలోని పురాతన ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీనిని 12వ శతాబ్దంలో రాజా జయసింహ కాలంలో నిర్మించారని నమ్ముతారు. ఈ ఆలయానికి చారిత్రక, మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది. హిందువులకు భక్తి కేంద్రంగా ఉన్న ఈ ఆలయంలో శివలింగం పూజలను అందుకుంటోంది. ఈ గుడిలో ఒక పీఠంతో పాటుగా శివ లింగం ఒక నీటి బుగ్గలో కవర్ చేయబడి ఉంటుంది. ఈ శివలింగానికి దైవిక శక్తి ఉందని, భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముకం. అంతే కాకుండా అమర్‌నాథ్ యాత్రకు వెళ్ళే చాలా మంది భక్తులు అమరనాథ్ ని దర్శనం చేసుకోవడానికంటే ముందు ఈ ఆలయాన్ని కూడా సందర్శించి అనంతరం అమర్నాథ్ కి వెళ్తూ ఉంటారు.
ఈ ఆలయంతో ముడిపడి అనేక పౌరాణిక కథలు ముడిపడి ఉన్నాయి. ఒక పౌరాణిక గాథ ప్రకారం.. పార్వతి దేవి స్నానానికి వెళ్తూ ఈ ప్రదేశంలో గణేశుడిని ద్వారపాలకుడిగా నియమించింది. లోపలికి ఎవరూ ప్రవేశించకుండా చూడమని చెప్పి వెళుతుంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పరమేశ్వరుడిని లోపలకు వెళ్లకుండా వినాయకుడు అడ్డుకుంటాడు. అప్పుడే శివుడు వినాయకుడి తలను ఖండిస్తాడు. అనంతరం బాలుడికి ఏనుగు తలను అతికించిన ప్రదేశం ఇదే అని నమ్మకం. ఈ కారణంగా కూడా ఈ ప్రదేశం శివ, గణపతుల భక్తులకు ముఖ్యమైనది.. అదేవిధంగా ఈ ఆలయంలో రెండు ముఖాల నంది విగ్రహం ఉంటుంది. ఇది ఇతర శివాలయాల కంటే భిన్నంగా ఉంటుంది. భక్తులకు ప్రత్యేక ఆకర్షణ కేంద్రంగా ఉంది.
మామలేశ్వర్ ఆలయాన్ని సందర్శించకుండా పహల్గామ్ పర్యటన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. పార్వతి దేవి ఇక్కడే శివుని కోసం తపస్సు చేసి ఆయనను భర్తగా పొందిందని నమ్ముతారు. అందువల్ల ఈ ఆలయం శివ-పార్వతిల కలయికను సూచిస్తుంది. భక్తులు ఈ ఆలయాన్ని వివాహం, ప్రేమ, భక్తి కలగలిపిన ప్రదేశంగా భావిస్తారు. అమర్‌నాథ్ యాత్ర పహల్గాం నుంచి ప్రారంభమవుతుంది. మామలేశ్వర్ ఆలయం అదే మార్గంలో ఉంది. శివ భక్తులు అమర్‌నాథ్ కు వెళ్లే ముందు ఇక్కడికి వెళ్లి శివయ్యని దర్శనం చేసుకుని తమ ప్రయాణాన్ని మొదలు పెట్టడం శుభప్రదం అని భావిస్తారు భక్తులు. ఈ ఆలయం లిడ్డర్ నది ఒడ్డున పహల్గామ్ లోని ప్రశాంతమైన, సుందరమైన లోయలలో ఉంటుంది. మహా శివరాత్రి, శ్రావణ మాసాల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తారు. రాత్రి జాగరణ, అన్న ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ పండుగల సమయంలో వేలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తారు.