TTD: ముత్యపు కవచంలో మురిపించిన శ్రీ మలయప్ప
- By Balu J Published Date - 11:56 PM, Thu - 20 June 24

TTD: తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో భాగంగా రెండో రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి నాలుగు మాడ వీధులలో విహరిస్తూ భక్తులను మురిపించారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారికి, దేవేరులకు అభిదేయక అభిషేకాన్ని కన్నులపండుగగా చేపట్టారు. అనంతరం సహస్రదీపాలంకార సేవలో స్వామి ముత్యపు కవచంలో భక్తులను అనుగ్రహించారు. కాగా సంవత్సరంలో ఒకమారు మాత్రమే ముత్యపు కవచాన్ని ధరించిన స్వామివారి ముగ్దమనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.
తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో భాగంగా రెండో రోజు ఉదయం 6.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు మరియు వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారికి, దేవేరులకు అభిదేయక అభిషేకాన్ని కన్నులపండుగగా చేపట్టారు.