Magha Masam 2025: మాఘ మాసంలో ఎలాంటి పనులు చేయాలి.. ఎలాంటి పనులు చేయకూడదు మీకు తెలుసా?
మాఘ మాసంలో ఎలాంటి మంచి పనులు చేస్తే శివుడి అనుగ్రహం కలుగుతుంది ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 05:04 PM, Tue - 4 February 25

హిందువులకు ఎంతో ఇష్టమైన మాసాలలో మాఘమాసం కూడా ఒకటి. ఈనెల అంతా కూడా ప్రత్యేకంగా పూజలు చేయడంతో పాటు మాఘస్నానాలు చేసి శివుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటారు. నాన్ వెజ్ కి దూరంగా ఉంటూ కేవలం వెజ్ మాత్రమే తింటూ ఉంటారు. తెలుగు మాసంలో 11వ నెల మాఘ మాసం. ఉత్తరాయణంలో ఈ మాసంలో శివారాధనతో పాటు విష్ణువు ఆరాధనకు ఇది ప్రత్యేకం అని చెప్పాలి. ఈ మాసంలో మనం చేసేటటువంటి పనులు ప్రత్యేక ఫలితాలను అందిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది అనగా 2025లో జనవరి 30వ తేదీన మొదలైన మాఘ మాసం ఫిబ్రవరి 28 వరకు ఉంటుంది. మరి ఈ నెలలో కొన్ని రకాల పనులు చేయాలని కొన్నింటిని చేయకూడదని పండితులు చెబుతున్నారు.
మరి మాఘ మాసం నెలలో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మాఘమాసంలో చేసేటటువంటి స్నానాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా గంగ స్నానం అత్యంత పుణ్య పదం అని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో చేసే స్నానానికి మరింత ప్రాధాన్యత ఉంటుందట. ఈ మాసంలో విష్ణు సహస్రనామంతో పాటు భగవద్గీత పఠనం చేయాలని చెబుతున్నారు. ఈ మాసంలో ప్రతిరోజూ దీపం వెలిగించి తులసిని పూజించడం పుణ్యప్రదం. ఈ మాసంలో వస్త్ర దానం చేయడంతో పెద్దలకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయట. ఈ మాసం అంతా శివయ్యకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు పండితులు.
మరి ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయానికి వస్తే.. కాగా మాఘ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో ముల్లంగిని తినకూడదట. అంతేకాదు ఉల్లిగడ్డ, ఎల్లిపాయ వంటి తామసిక ఆహారం కూడా తీసుకోకూడదని చెబుతున్నారు. మద్యం మాంసాహారం వంటి వాటికి కూడా దూరంగా ఉండాలట.. ఎవరిని అవమానించడం అవహేళన చేయడం వంటివి చేయకూడదని చెబుతున్నారు. ఉపవాసం ఉండాలి అనుకున్న వారు రోజుకు ఒక్కసారి భోజనం చేసి దేవుడిపై మనసు లగ్నం చేయాలని చెబుతున్నారు.