Spirtual: పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా చెంబులో నీటిని ఉంచాలా? దానివల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?
మామూలుగా చాలా మంది పూజ చేసేటప్పుడు పూజ గదిలో చెంబుతో నీరు పెడుతూ ఉంటారు. ఇంకొందరు అస్సలు పెట్టారు. అయితే పూజ చేసేటప్పుడు కచ్చితంగా ఇలా నీరు పెట్టాలా ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 10:00 AM, Mon - 28 April 25

మామూలుగా పూజ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధివిధానాలను పాటిస్తూ ఉంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఇలా పూజ చేసే సమయంలో చాలా రకాల సందేహాలు నెలకొంటూ ఉంటాయి. వాటిలో పూజ చేసేటప్పుడు చెంబులో నీరు పెట్టాలా వద్దా అన్న సందేహం కూడా ఒకటి. ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పూజ గదిలో చెంబులో అనగా రాగి చెంబులో లేదా స్టీలు ఇత్తడి ఇలా ఏదో ఒక పాత్రలో నీరు పెట్టడం మనం చూసే ఉంటాం.
ఇలా నీటిని ఉంచి పూజ చేయడం ద్వారా సర్వదేవతలు సంతృప్తి చెందుతారని విశ్వాసం. మహా నైవేద్యం కంటే ఈ విధంగా నీటిని పెట్టి పూజించడం ద్వారా దేవతలు సంతృప్తి చెందడంతో పాటు కోరిన కోరికలు నెరవేరుస్తారని భక్తుల నమ్మకం. పూజ గదిలో రాగి చెంబులో నీటిని పెట్టి మంత్ర పఠనం చేసి ఆ తర్వాత ఆ నీటిని తాగడం వల్ల సర్వ రోగాలు నయమవుతాయట. అదేవిధంగా ప్రతిరోజు పూజ సమయంలో నీటిని తీర్థంగా సేవిస్తే అనారోగ్య సమస్యలు ఉండవట.అలాగే సమస్త దోషాలు కూడా ఉండవని చెబుతున్నారు.
అలా చెంబులో పెట్టిన నీటిని రోజు మార్చి రోజు మార్చడంతో పాటు వాటిని చెట్లకు పోయాలట. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ దూరమవుతుందట. అలాగే పూజ చేసేటప్పుడు గంట మోగించడం వల్ల దుష్టశక్తులు, ప్రతికూల శక్తులు దూరమవుతాయట. పూజ చేసేటప్పుడు ప్రకృతిని పంచభూతాలను ఆరాధించడం వల్ల ప్రతికూల శక్తులు ఇబ్బందులు ఉండవట. ప్రతి ఇంట్లోనూ పూజగదిలో పూజకు ముందు రాగి, వెండి పాత్రలలో నీటిని దేవుని ముందు పెట్టాలి. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి మొత్తం ఆ పాత్రలోని నీటిలో నిక్షిప్తమై అది ఇంటికి మంచిది చేకూరుస్తుందట. పూజ చేసిన తర్వాత తీసుకున్న తీర్థంలో భగవంతుడి శక్తి నిక్షిప్తమై అది ఆ కుటుంబానికి శుభాలను చేకూరుస్తుందట. పూజకు ఉపక్రమించే ముందు పాత నీటిని ఇంటి ముందు ఉన్న తులసి కోటలో పోసి, ఆపై రాగి చెంబును కొత్త నీటితో నింపి మాత్రమే పూజ చేయాలట. పాత నీటితోనే పూజ చేస్తే ఆ పూజకు ఎటువంటి ఫలితమూ ఉండదు. పైగా దేవతలకు ఆగ్రహం కూడా వస్తుందట.