Karthika Masam: కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎందుకు పెడతారో తెలుసా?
కార్తీకమాసంలో ఉసిరి దీపాలు పెట్టడం వెనుక ఉన్న ప్రాముఖ్యత గురించి తెలిపారు.
- By Anshu Published Date - 10:32 AM, Mon - 11 November 24

కార్తీకమాసంలో రకరకాల దీపాలను వెలిగిస్తూ ఉంటారు. అందులో ఉసిరి దీపం కూడా ఒకటి. ఈ ఉసిరి దీపాలను రావి చెట్టు కింద, అలాగే పరమేశ్వరుడు ఆలయాలలో శ్రీ మహా విష్ణువు ఆలయాలలో వెలిగిస్తూ ఉంటారు. ఇంకొందరు ఉసిరి దీపాలను వెలిగించి నీటిలో కూడా వదులుతూ ఉంటారు. కేవలం కార్తీకమాసంలోనే ఈ ఉసిరి దీపాలని ఎందుకు వెలిగిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉసిరి చెట్టును ఈశ్వరుడి స్వరూపంగా భావిస్తారు. అంతేకాదు ఉసిరి చెట్టులో శివకేశవులతో పాటు బ్రహ్మ, సకల దేవతలు నివసిస్తారని నమ్ముతారు. అన్ని విశిష్టతలతో కార్తీక మాసంలో ఉసిరికాయకు చాలా ప్రత్యేక స్థానం ఉంది.
అందుకే కార్తీక మాసంలో ముఖ్యంగా దశమి, ఏకాదశి, సోమవారాలు, పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగించడం వల్ల గొప్ప ప్రయోజనాలు చేకూరుతాయట. కార్తీక మాసంలో దీపాలు ప్రధానం. దూది వత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి అరటి పండ్లలో వేసి వెలిగిస్తారు. ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి కార్తీక దీపాలను వెలిగించి నీటిలో వదలాలి. కార్తీక దీపాలను సాధారణంగా కర్రలతో వెలిగిస్తారు. కానీ కార్తీక మాసంలో ఉసిరి దీపాలకి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేయడం మంచిదని అందరికీ తెలుసు, కానీ ఉసిరి కాయతో దీపాలు వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయట.
నవ గ్రహ దోషాలు పరిహారమవుతాయని చాలా మందికి తెలియదు. కార్తీకమాసంలో ఉసిరి, ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే నవగ్రహ దోషాల పరిహారాలు లభిస్తాయట. ఉసిరికాయను తీసుకుని మధ్యలో గుండ్రంగా కట్ చేస్తే దీపంలో సిద్ధమవుతుంది. బెజ్జంలో నెయ్యి నింపి అందులో తామర పువ్వుల వత్తులు వేసి దీపం వెలిగించాలి. ఉసిరి దీపం ఇలా వెలిగిస్తే విష్ణువు, లక్ష్మీదేవి సంతోషిస్తారు. సకల సంపదలతో పాటు మహిళలు సుఖ సంతోషాలతో మరణిస్తారని అంటారు. ఉసిరి లక్ష్మీదేవికి ఇష్టమైనది. అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి, శ్రీమహావిష్ణువు, ఈశ్వరుని అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగిస్తే నరదిష్టితో పాటు సకల నవగ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.