Kala Sarpa Dosha: కాలసర్ప దోషం నుంచి విముక్తి పొందాలంటే నాగుల పంచమి రోజు ఇలా చేయాల్సిందే?
ఎవరైనా కాలసర్ప దోషంతో బాధపడుతుంటే నాగుల చవితి రోజు కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే ఆ దోషం నుంచి విముక్తి పొందవచ్చు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:40 PM, Mon - 5 August 24

హిందూ సంప్రదాయం ప్రకారం శ్రావణమాసంలో వచ్చే నాగుల పంచమికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. నాగుల పంచమి రోజున చేసే పూజలు పరిహారాలు విశేష ఫలితాలను అందిస్తాయి. నాగుల పంచమి రోజున నాగ దేవతలను పూజించడం ద్వారా అన్ని సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభించి కష్టాలు కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఈ సమయంలో నాగదేవతలను పూజించే వారికి కాలసర్ప దోషం నుంచి కూడా విముక్తి లభిస్తుందట. అందుకే చాలామంది భక్తులు నాగుల పంచమి రోజున నాగదేవతలకు పాలాభిషేకం చేసి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు.
అంతేకాకుండా ప్రత్యేకమైన ఉపవాసాలు కూడా పాటిస్తారు. అయితే పంచాంగం ప్రకారం ఈ ఏడాది నాగుల పంచమి 2024 ఆగస్టు 9వ తేదీ శుక్రవారం వచ్చింది. ఈరోజు శుక్లపక్షం లోని తొమ్మిదవ రోజు కావడంతో నాగుల పంచమిని జరుపుకుంటారు. ఇక నాగుల పంచమి శుభ సమయాల విషయానికొస్తే.. ఆగస్టు 9వ తేదీన ఉదయం 12 గంటలకు ప్రత్యేకమైన తిథి ప్రారంభం అవుతుంది. ఇది 10వ తేదీ తెల్లవారి జామున వరకు కొనసాగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పంచాంగం ప్రకారం ఈ పండుగను శుక్లపక్షమి ఆగస్టు 9వ తేదీన జరుపుకోవడమే మంచిదట.
అలాగే ఈ నాగ పంచమి రోజున దేవతలను పూజించే క్రమంలో పెరుగు, అన్నం, నిమ్మకాయ, వేప, దోసకాయలతో కలిపిన ఒక ప్రత్యేకమైన వంటకాన్ని నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ వంటకాన్ని కాలసర్పదోషంతో బాధపడుతున్న వారు దేవతలకు సమర్పించి ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం వల్ల దోషం నుంచి విముక్తి కలుగుతుందని పండితులు సైతం చెబుతున్నారు. దీంతో పాటు ఈరోజు కాలసర్ప దోషంతో బాధపడేవారు మృత్యుంజయ మంత్రాన్ని కూడా పారాయణం చేయడం వల్ల శుభం కలుగుతుందట.
అలాగే నాగుల పంచమి రోజున శివారాధన చేయడం కూడా చాలా శుభప్రదమని చెబుతున్నారు.
కాగా ఈ రోజు శివలింగం పై గంగాజలంతో పాటు నల్ల నువ్వులతో అభిషేకం చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు చెబుతున్నారు. అంతేకాకుండా చాలామంది హిందువులు ఈరోజు నదీ స్నానాన్ని ఆచరించి నదిలో వెండి లేదా రాగి వస్తువులను వదులడం కూడా మంచిదట. ఇలా చేయడం వల్ల అన్ని దేవతల అనుగ్రహం లభించి జీవితంలో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయని చెబుతున్నారు.
note : ఈ సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్నా పండితుల సలహా తీసుకోవడం మంచిది..