Karthika Masam: కార్తీక మాసంలో వెలిగించే ధనదీపం వల్ల కలిగే లాభాల గురించి మీకు తెలుసా?
మీరు పడే బాధల నుంచి విముక్తి పొందాలంటే కార్తీక మాసంలో ధన దీపం కచ్చితంగా వెలిగించాల్సిందే అంటున్నారు పండితులు.
- By Anshu Published Date - 02:00 PM, Tue - 5 November 24

ప్రస్తుతం కార్తీకమాసం కావడంతో శివాలయాలు అలాగే శ్రీ మహావిష్ణు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. కార్తీక దీపాలతో ఆలయాలన్నీ వెలిగిపోతున్నాయి. అయితే కార్తీక మాసంలో ధనదీపం పేరుతో ఒక ప్రత్యేకమైన దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి? ఎప్పుడు వెలిగించాలి అన్న విషయానికి వస్తే.. ధనదీపం వెలిగించాలనుకున్న రోజు తెల్లవారు జామున నిద్ర లేచి ఇంటితో పాటు పూజగదిని శుభ్రం చేసుకోవాలట.
తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవి ఫోటోని గంధం, కుంకుమ బొట్లతో అలంకరించాలట. తర్వాత పూజ కోసం ఏర్పాటు చేసుకున్న పీటకు ముందు భాగంలో మూడు చోట్ల పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టాలట. ఇక పీట మీద రాగి లేదా ఇత్తడి పళ్లెంను ఉంచి ఐదు చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలట. తర్వాత ఆ పళ్లెంలో గుప్పెడు బియ్యం పోసుకొని, అందులో కొద్దిగా పసుపు, కుంకుమ వేయాలట. అలాగే అందులో ఒక గులాబీ పువ్వును ఉంచాలట. బియ్యంలో రూపాయి బిళ్ల కూడా వేయాలని చెబుతున్నారు. ఆ తర్వాత రెండు చిన్న మట్టి ప్రమిదలను తీసుకొని వాటికి పూర్తిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి సిద్ధం చేసుకోవాలట. తర్వాత రాగి లేదా ఇత్తడి పళ్లెంలో ఉన్న బియ్యంలో ఒక మట్టి ప్రమిదను ఉంచాలి.
ఆ ప్రమిదలో మూడు యాలకులు, మూడు లవంగాలు, కొద్దిగా రాళ్లు ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత రెండో మట్టి ప్రమిదను తీసుకొని మొదటి ప్రమిద మీద ఉంచాలి. ఆపై ఆ ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసుకోవాలి. అనంతరం అందులో రెండు లేదా మూడు వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి వేసుకోవాలి. అనంతరం దాన్ని ఏక హారతి లేదా ఆగరుబత్తితో వెలిగించుకోవాలి. దీన్నే ధనదీపం లేదా లక్ష్మీదీపం అని పిలుస్తారు. ఇక దీపం కొండెక్కిన తర్వాత మొదటి ప్రమిదలో ఉన్నటువంటి యాలకులు, లవంగాలు, రాళ్ల ఉప్పును తీసుకొని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలట. అలాగే పళ్లెంలో ఉన్నటువంటి గులాబీ పువ్వును ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలట.
బియ్యంలో ఉన్న రూపాయి కాయిన్ తీసుకొని దాన్ని ఒక పసుపు లేదా ఎరుపు వస్త్రంలో మూటకట్టి మీరు ధనం దాచుకునే బీరువాలో దాచుకోవాలట. అనంతరం ఆ పళ్లెంలో ఉన్న బియ్యంతో పొంగలి తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి మీరు ప్రసాదంగా స్వీకరించాలనీ పండితులు చెబుతున్నారు. అయితే ఈ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అన్న విషయానికి వస్తే.. కార్తీక మాసంలో ఏ రోజు అయినా ముఖ్యంగా గురువారం లేదా శుక్రవారం ఈ దీపాన్ని వెలిగిస్తారు వారి ఇంట్లోకి శ్రీ మహాలక్ష్మి దేవి ప్రవేశించడంతోపాటు ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు తీరిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట..