Bibi-ka-Alam: హైదరాబాద్లో జయప్రదంగా ముగిసిన బీబీ కా ఆలమ్ ఊరేగింపు
బీబీకా ఆలం ఊరేగింపులో వేలాది మంది ప్రజలు పాల్గొని మూసీ నది ఒడ్డున ఉన్న చంద్రఘాట్ వద్ద ముగిసింది.ఇస్లామిక్ క్యాలెండర్‌లో ముహర్రం నెలలోని 10వ రోజుని యౌమ్-ఎ-అషురా అంటారు.
- Author : Praveen Aluthuru
Date : 17-07-2024 - 10:48 IST
Published By : Hashtagu Telugu Desk
Bibi-ka-Alam: మొహర్రం సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో బీబీ కా ఆలం ఊరేగింపు జరిగింది.పాతబస్తీలోని వివిధ ప్రాంతాల గుండా సాగిన బీబీకా ఆలం ఊరేగింపులో వేలాది మంది ప్రజలు పాల్గొని మూసీ నది ఒడ్డున ఉన్న చంద్రఘాట్ వద్ద ముగిసింది.ఇస్లామిక్ క్యాలెండర్‌లో ముహర్రం నెలలోని 10వ రోజుని యౌమ్-ఎ-అషురా అంటారు. ఈ సందర్భంగా ముహమ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ మరియు అతని అనుచరులు కర్బలా యుద్ధంలో వీరమరణం పొందిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
బీబీ కా ఆలం అనేది ఒక చెక్క సింహాసనం అని నమ్ముతారు. బీబీ కా అలావా నుంచి ప్రారంభమైన ఊరేగింపు షేక్ ఫైజ్ కమాన్, యాకుత్‌పురా దర్వాజా, ఇత్బార్ చౌక్, చార్మినార్, గుల్జార్ హౌజ్, పంజేషా, మణి మీర్ ఆలం, పురానీ హవేలీ, దారుల్షిఫా మీదుగా సాగింది. చెప్పులు లేకుండా యువకులు, కత్తులు, బ్లేడ్ చైన్లు మరియు ఇతర పదునైన ఆయుధాలతో యా హుస్సేన్ అని నినాదాలు చేస్తూ, మర్సియా మరియు నోహా-ఖ్వానీని పఠిస్తూ తమను తాము గాయపరచుకున్నారు. మరికొందరు తమ ఛాతీని కొట్టుకుంటూ నినదించారు.
కర్ణాటక నుంచి తీసుకొచ్చిన రూపావతి అనే ఏనుగుపై ఆలం వేశారు. ఏనుగులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తరలించే నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మార్చడంతో కర్ణాటక రాష్ట్రం దావణగెరెలోని శ్రీ జగద్గురు పంచాయతన ఆలయం నుంచి ఏనుగు రాక ఆలస్యమైంది. అనంతరం రెండు రాష్ట్రాల అటవీశాఖ మంత్రుల మధ్య చర్చల ద్వారా సమస్య పరిష్కారమైంది. ఇందుకోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఊరేగింపు కోసం ట్రాఫిక్‌ను మళ్లించారు. ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది.
Also Read: Revanth Reddy: హరీష్ రాజీనామాకు సిద్ధమా?