పవిత్రస్థలం..అపవిత్రం చేసారు కదరా ! మీ ఫోటో షూట్ తగిలేయ్య !!
అత్యంత పవిత్రమైన శ్రీవారి ఆలయ ముఖద్వారం వద్ద, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఒక జంట చేసిన ప్రీ-వెడ్డింగ్ షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. గొల్లమండపం నుంచి అఖిలాండం వరకు అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో, భక్తుల సాక్షిగా ఆ జంట రొమాంటిక్ స్టిల్స్ ఇస్తుంటే
- Author : Sudheer
Date : 29-01-2026 - 5:38 IST
Published By : Hashtagu Telugu Desk
Tirumala: భక్తి పారవశ్యానికి నిలయమైన తిరుమల మాడ వీధులు.. నేడు ఫ్యాషన్ షూట్లకు వేదికగా మారుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. అత్యంత పవిత్రమైన శ్రీవారి ఆలయ ముఖద్వారం వద్ద, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఒక జంట చేసిన ప్రీ-వెడ్డింగ్ షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. గొల్లమండపం నుంచి అఖిలాండం వరకు అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో, భక్తుల సాక్షిగా ఆ జంట రొమాంటిక్ స్టిల్స్ ఇస్తుంటే.. అడ్డుకోవాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భక్తితో స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు, ఈ విపరీత ధోరణులు విస్మయాన్ని కలిగిస్తున్నాయి.
టీటీడీ నిబంధనలను బేఖాతరు చేస్తూ సాగుతున్న ఈ ప్రచార పిచ్చి, ఆలయ భద్రతా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. తిరుమల క్షేత్రంలో రీల్స్ చేయడం, కెమెరాలతో షూటింగ్‌లు నిర్వహించడంపై ఇప్పటికే కఠినమైన నిషేధం ఉన్నప్పటికీ, వేల సంఖ్యలో ఉండే విజిలెన్స్ సిబ్బంది కళ్లముందే ఈ తంతు ఎలా సాగిందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. గంటల తరబడి షూటింగ్ జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం వెనుక నిర్లక్ష్యం ఉందా లేక నిబంధనల అమలులో పక్షపాతం ఉందా అని నెటిజన్లు నిలదీస్తున్నారు. పవిత్రమైన మాడ వీధులను కేవలం ఒక ‘లోకేషన్’ లాగా భావించి, అక్కడ అపవిత్రంగా ప్రవర్తించడం క్షమించరాని నేరమని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
ఆధ్యాత్మికత కంటే ఆడంబరానికే ప్రాముఖ్యతనిచ్చే ఇటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవాలయం అనేది ఆత్మశాంతికి, భక్తికి నెలవు కావాలి కానీ, వ్యక్తిగత ప్రచారానికి లేదా సామాజిక మాధ్యమాల్లో లైకుల కోసం చేసే విన్యాసాలకు వేదిక కాకూడదు. టీటీడీ అధికారులు తక్షణమే స్పందించి, ఆ జంటపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భద్రతను కట్టుదిట్టం చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. తిరుమల పవిత్రతను కాపాడటం కేవలం అధికారుల బాధ్యతే కాదు, ప్రతి భక్తుడి కనీస ధర్మం అని ఈ ఘటన గుర్తుచేస్తోంది.