Ainavilli Siddhi Vinayaka : పెన్నులతో అభిషేకం జరిపించుకునే అయినవిల్లి సిద్ధి వినాయక
అసలు కానిపాకం పుణ్యక్షేత్రం కావడానికి ఈ అయినవిల్లి సిద్ధి వినాయకుడే (Ainavilli Siddhi Vinayaka) కారణమని స్థలపురాణం చెబుతుంది.
- Author : Vamsi Chowdary Korata
Date : 11-10-2023 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
Ainavilli Siddhi Vinayaka : అయినవిల్లిలోని సిద్ధి వినాయకుడు స్వయంభువుడు. ఈయన కానిపాకం వినాయకుడి కంటే ముందే ఇక్కడ కొలువై ఉన్నాడని చెబుతారు. అసలు కానిపాకం పుణ్యక్షేత్రం కావడానికి ఈ అయినవిల్లి సిద్ధి వినాయకుడే కారణమని స్థలపురాణం చెబుతుంది.
ఇక్కడ నిత్యం లక్ష్మీగణపతి హోమం చాలా ఏళ్లుగా జరుగుతూ ఉంది. అదే విధంగా ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో స్వామివారికి పెన్నులతో అభిషేకం చేయించి వాటిని విద్యార్థులకు అందజేస్తారు. ఇంతటి విశిష్టమైన అయినవిల్లి సిద్ధి వినాయకుడికి (Ainavilli Siddhi Vinayaka) సంబంధించిన కథనం మీ కోసం.
స్వయంభువుడు:
అయినవిల్లి గణపతి స్వయంభువుడని చెబుతారు. ఈ క్షేత్రంలోని వినాయకుడు కానిపాకం కంటే పూర్వం నుంచే ఇక్కడ కొలువై ఉన్నాడని పురాణ కథనం. అసలు కానిపాకంలో వినాయకుడు భక్తులకు దర్శనమివ్వడానికి ఇక్కడి సిద్ధి వినాయకుడే కారణమని చెబుతారు. ఇందుకు సంబంధించిన పురాణ కథనం కూడా ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో మల్లాది బాపన్నావధులు అనే గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయన స్వర్ణగణపతి మహాయాగం నిర్వహించాలనుకొన్నాడు.
యాగం చివరిలో..
అనుకొన్న ప్రకారమే యాగం నిర్విఘ్నంగా పూర్తవుతూ వస్తోంది. అయితే యాగం చివరి రోజున సమర్పించే పూర్ణాహుతి ద్రవ్యాన్ని స్వర్ణమయ కాంతులతో వెలిగే గణపతి తన తొండంతో అందుకోవాలని ఆమల్లాది బాపన్నావధులు వినాయకుడి వేడుకొన్నాడు. పరమ భక్తుడైన మల్లాది బాపన్నావధుల కోరికను తీర్చడానికి యాగం చివరి రోజున వినాయకుడి ఇక్కడ వారికి దర్శనమిచ్చాడు. అయితే ఆ సమయంలో ఆయాగంలో పాల్గొన్న ముగ్గురు వినాయకుడి రూపాన్ని చూసి నవ్వడమే కాకుండా అవహేలనగా మాట్లాడారు.
అలా కానిపాకం కంటే ముందు
దీంతో వచ్చే జన్మలో వారు గుడ్డి, చెవిటి, మూగవాళ్లుగా పుడతారని ఆ వినాయకుడు శాపం పెట్టాడు. దీంతో భయపడిన వారు తమ తప్పును మన్నించాల్సిందిగా వేడుకొన్నారు. కరుణామయుడైన వినాయకుడు మీ వల్ల నా స్వయంభు విగ్రహం భక్తులకు దర్శనమిస్తుందని అప్పుడు మీరు శాపం నుంచి విముక్తులవుతారని చెప్పాడు.
దక్షప్రజాపతి:
అటు పై అక్కడి పండితుల విన్నపం మేరకు స్వామి వారు అయినవిల్లిలో సిద్ధి వినాయకుడిగా కొలువై ఉండిపోయాడు. ఆ ముగ్గురే తరువాతి జన్మలో కాణిపాకం వద్ద గుడ్డి, చెవిటి, మూగవారిగా జన్మించారని చెబుతారు. ఇలా అయినవిల్లి సిద్ధి వినాయకుడు (Ainavilli Siddhi Vinayaka) కానిపాకం వినాయకుడి కంటే ఎన్నో ఏళ్ల ముందు నుంచి ప్రజల చేత నీరాజనాలు అందుకొంటున్నట్లు స్థానిక పురాణ కథనం. ఇదిలా ఉండగా దక్షప్రజాపతి తాను యాగం ప్రారంభించే ముందు ఇక్కడి వినాయకుడినే ప్రార్థించినట్లు కూడా చెబుతారు.
నిత్యం లక్ష్మీ గణపతి హోమం:
ఈ ఆలయ ప్రాంగణంలో నిత్యం లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తారు. ఇక్కడకు వచ్చిన భక్తులెవరైనా రూ.300 చెల్లించి ఈ హోమంలో పాల్గొనవచ్చు. మామూలుగా అయితే ఈ హోమానికి వేల రుపాయలు ఖర్చవుతుంది. విద్యార్థల కోసం ఏటా వార్షిక పరీక్షల ముందు ఫిబ్రవరిలో లక్ష పెన్నులతో స్వామివారికి అభిషేకం చేసి వాటిని విద్యార్థులకు అందిస్తారు. అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. రాజమండ్రి నుంచి ఇక్కడకు 54 కిలోమీటర్లు.
Also Read: Hawks : మాంసాహారం తినే గద్దలు చక్కెర పొంగలి మాత్రమే తింటాయి. ఏంటా ఆలయం ప్రత్యేకత..!