విజయ్ జన నాయగన్ సినిమా విడుదల వాయిదా
- Author : Vamsi Chowdary Korata
Date : 08-01-2026 - 11:13 IST
Published By : Hashtagu Telugu Desk
Vijay Jana Nayagan Movie Postponed విజయ్ ఫ్యాన్స్‌కి షాక్! సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేసిన ‘జన నాయగన్’ మూవీ వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాలతో సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. కొత్త తేదీ త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన రిలీజ్ చేసింది. విజయ్ చివరి సినిమాకి ఇలా ఆటంకాలు ఎదురవ్వడంపై ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్’. హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ను సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో విడుదలపై సందిగ్ధత నెలకొంది. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. కొన్ని అనివార్య కారణాలతో సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నామని, త్వరలోనే కొత్త విడుదల తేదీని వెల్లడిస్తామని పేర్కొంది.
మా శ్రేయోభిలాషులకు, ప్రేక్షకులకు ఈ వార్తను తెలియజేయడానికి మేము చాలా విచారిస్తున్నాము. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జన నాయకన్’ సినిమా జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. అయితే మా నియంత్రణలో లేని కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమాపై మీకున్న అంచనాలు, ఉత్సాహం, భావోద్వేగాలను మేము పూర్తిగా అర్థం చేసుకోగలము. ఈ నిర్ణయం తీసుకోవడం మాకు కూడా చాలా కష్టమైన విషయమే. కొత్త విడుదల తేదీని వీలైనంత త్వరలో ప్రకటిస్తాము. అప్పటి వరకు, ప్రేక్షకులు, అభిమానులు ఓపికతో ఉండి మాపై మీ ప్రేమాభిమానాలను ఇలాగే కొనసాగించాలని వినయపూర్వకంగా కోరుకుంటున్నాము. మీ అచంచలమైన మద్దతే మా ‘జన నాయకన్’ టీమ్‌కు అతిపెద్ద బలం. అది మాకు ఎంతో విలువైనది” అని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రకటనలో పేర్కొంది.
‘జన నాయగన్’ విజయ్ కెరీర్ లో చివరి సినిమా. దీనికి సెన్సార్ విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. గత డిసెంబరులో సెన్సార్ కోసం సినిమాను పంపగా, కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొన్ని సీన్స్ డిలీట్ చేయాలని, కొన్ని డైలాగ్స్ మ్యూట్ చేయాలని సెన్సార్ బోర్డు సభ్యులు సూచించినట్లు సమాచారం. మేకర్స్ తగిన మార్పులు చేసి మళ్లీ సెన్సార్‌కు పంపగా, బోర్డు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో కేవీఎన్ ప్రొడక్షన్ మద్రాసు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది.
Vijay’s Jana Nayagan Postponed In India, No January 9 Release జన నాయగన్’ సెన్సార్ కేసుపై బుధవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. సెన్సార్ బోర్డు తరఫున సొలిసిటర్ జనరల్, కేవీఎన్ ప్రొడక్షన్స్ తరఫున న్యాయవాది పరాశరన్ తన వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ ఆశా.. తీర్పును రిజర్వ్ చేశారు. జనవరి 9న సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా, అదే రోజు ఉదయం తీర్పు చెప్తామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సినిమా విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. తమిళంతో పాటుగా తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ మూవీ పోస్ట్ పోన్ అయింది. కోర్టు తీర్పును బట్టి న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది.