Mohan Babu : మనోజ్ నుండి ప్రాణహాని ఉంది – మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు
Mohan Babu : తన ప్రాణానికి, ఆస్తులకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని మోహన్‌బాబు పోలీసులను కోరారు. నాలుగు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన మంచు మనోజ్, ఇప్పుడు కొందరు సంఘవిద్రోహ శక్తులతో కలిసి తిరిగి వచ్చి, తన ఇంటి వద్ద అలజడి సృష్టిస్తున్నారని మోహన్ బాబు ఆరోపించారు
- By Sudheer Published Date - 10:09 PM, Mon - 9 December 24

ప్రముఖ నటుడు మోహన్‌బాబు (Mohan Babu) తన కుమారుడు మంచు మనోజ్ (Manchu Manoj), ఆయన భార్య మౌనిక(Manchu Manoj Wife Mounika)పై రాచకొండ పోలీసు కమిషనర్(Rachakonda Police Commissioner )కి ఫిర్యాదు (Complaint)చేయడం సంచలనంగా మారింది. తన ప్రాణానికి, ఆస్తులకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని మోహన్‌బాబు పోలీసులను కోరారు. నాలుగు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన మంచు మనోజ్, ఇప్పుడు కొందరు సంఘవిద్రోహ శక్తులతో కలిసి తిరిగి వచ్చి, తన ఇంటి వద్ద అలజడి సృష్టిస్తున్నారని మోహన్ బాబు ఆరోపించారు.
మోహన్ బాబు తన ఫిర్యాదులో కీలక విషయాలను ప్రస్తావించారు. “మనోజ్ కు చెందినవారుగా భావిస్తున్న 30 మంది వ్యక్తులు నా నివాసంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. నా సిబ్బందిని బెదిరించి, ఇంటిని ఆక్రమించుకునేందుకు కుట్ర పన్నారు. వారు మనోజ్, మౌనికల ఆజ్ఞల మేరకే ఈ చర్యలకు దిగారని నాకు తెలిసింది” అని ఆయన పేర్కొన్నారు. తన నివాసం వద్ద పరిచయం లేని వ్యక్తులు తిష్ట వేసి ఉండటంతో, తాను ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. “నా వయసు 78 సంవత్సరాలు. ఈ వయసులో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావడం బాధాకరం. నా ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు ఉందని భావిస్తున్నాను. ఈ పరిస్థితి నుండి బయటపడేందుకు పోలీసుల సహాయం కావాలి” అని ఆయన పేర్కొన్నారు.


ఈ ఘటనపై మోహన్ బాబు రాచకొండ కమిషనర్‌కు లేఖతో పాటు పహాడీ షరీఫ్ ఎస్సై, ఏసీపీ, మహేశ్వరం డీసీపీకి ఫిర్యాదు పంపించారు. తన ఇంటి వద్ద ఏర్పడిన పరిణామాలను సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పరిశీలించాలని, సంఘవిద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటె కొద్దీ సేపటి క్రితం మనోజ్ సైతం పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు. నిన్న ఉదయం తన ఇంటికి పది మంది గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిని ఆపడానికి ప్రయత్నించే క్రమంలో తనకు గాయాలు అయ్యాయని , దాడి తర్వాత ఆసుపత్రికి వెళ్లానని, తాను హాస్పటల్ కు వెళ్ళగానే సీసీటీవీ ఫుటేజి మాయం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయ్ రెడ్డి, కిరణ్ అనే వ్యక్తులు సీసీటీవీ ఫుటేజిని తొలగించారని కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ ఘటనలో తన భార్య, పిల్లల ప్రాణాలకు ముప్పు ఉందని కూడా పోలీసులకు వివరించారు. కాకపోతే ఆ ఫిర్యాదులో మోహన్ బాబు పేరుకుని విష్ణు పేరు కానీ ప్రస్తావించలేదు. అయితే మోహన్ బాబు మాత్రం మనోజ్ , అలాగే మౌనిక లపై ఫిర్యాదు చేసాడు.
Read Also : Threat Call : పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరించిందెవరో తెలుసా..?