Taraka Ratna: తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది: విజయసాయి రెడ్డి
బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చూశారు.
- Author : Anshu
Date : 01-02-2023 - 8:24 IST
Published By : Hashtagu Telugu Desk
Taraka Ratna: బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చూశారు. ఆస్పత్రి సిబ్బందితో పాటు నందమూరి తారకరత్న కుటుంబ సభ్యులతో ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. ఆస్పత్రి సిబ్బంది మంచి వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు.
తారకరత్నకు ప్రస్తుతం మెదడుకు సంబంధించిన చికిత్స జరుగుతోందని ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. తారకరత్న గుండెతో పాటు ఇతర అవయవాలు బాగున్నాయని ఆయన తెలిపారు. తారకరత్న త్వరగా కోలుకుంటారని తాను ఆశిస్తున్నట్లు విజయసాయిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. నందమూరి బాలయ్య దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారని అన్నారు.
కాగా నారా లోకేష పాదయాత్రలో పాలుపంచుకుందామని వెళ్లిన నందమూరి తారకరత్న అస్వస్థతకు గురవడం తెలిసిందే. కుప్పంలో నందమూరి తారకరత్న అస్వస్థతకు గురి కాగా.. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి, వైద్య సేవలు అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు.
నందమూరి కుటుంబం నుండి తారకరత్న హీరోగా పరిచయం కాగా.. ఆరంభంలో మంచి హిట్లు అందుకున్న తారకరత్న.. తర్వాత మాత్రం సినిమాల్లో రాణించలేకపోయారు. దీంతో సినిమా ఇండస్ట్రీకి దూరమైన తారకరత్న.. అప్పుడప్పుడు టీడీపీ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలని అనుకున్న తారకరత్న.. నారా లోకేష్ పాదయాత్రలో భాగస్వామ్యం కావాలనుకోగా.. అంతలోనే అస్వస్థతకు గురి కావడం జరిగింది.