Tamil Heros : తమిళ నిర్మాతల సంచలన నిర్ణయం.. ఆ స్టార్ హీరోలపై బ్యాన్..?
తాజాగా ఓ నలుగురు స్టార్ హీరోలు నిర్మాతలని ఇబ్బంది పెడుతున్నారని, వారితో మాట్లాడినా వినట్లేదని తమిళ నిర్మాతల మండలి ఆ నలుగురు హీరోలకి రెడ్ కార్డు చూపించడానికి సిద్ధమైంది.
- By News Desk Published Date - 11:20 PM, Thu - 14 September 23

తమిళ్(Tamil) స్టార్ హీరోలు నలుగురికి తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి(Tamil Film Producers Council) షాక్ ఇచ్చింది. నలుగురు హీరోలకు రెడ్ కార్డు ఇవ్వబోతున్నట్టు తమిళ నిర్మాత మండలి నిర్ణయం తీసుకుందని సమాచారం. తమిళ పరిశ్రమలో నటీనటులు లేదా టెక్నీషియన్స్ ఎవరైనా సరే సినిమాకు, నిర్మాతలకు ఇబ్బందులు కలిగించినా, వారితో పరిశ్రమకు సమస్యలు ఉన్నా వారికి రెడ్ కార్డు(Red Card) చూపిస్తారు. కొన్నాళ్లపాటు సినీ పరిశ్రమ నుంచి బ్యాన్ చేస్తారు. లేదా వారికి సినిమాలు ఇవ్వకుండా చేస్తారు.
అయితే తాజాగా ఓ నలుగురు స్టార్ హీరోలు నిర్మాతలని ఇబ్బంది పెడుతున్నారని, వారితో మాట్లాడినా వినట్లేదని తమిళ నిర్మాతల మండలి ఆ నలుగురు హీరోలకి రెడ్ కార్డు చూపించడానికి సిద్ధమైంది. ఆ నలుగురు హీరోలు ధనుష్, శింబు, విశాల్, అధర్వ అని తెలుస్తుంది.
నిర్మాత మైఖేల్ రాయప్పన్ తో ఏర్పడిన వివాదాల విషయంలో శింబు(Shimbu)తో చర్చిలు జరిపినా అతని నుంచి ఎలాంటి మార్పు రాకపోవడంతో శింబుకి రెడ్ కార్డు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రొడ్యూసర్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విశాల్(Vishal) అసోసియేషన్ నిధుల్ని దుర్వినియోగపరిచాడని అతనికి రెడ్ కార్డు ఇవ్వనున్నారు. తెనందాల్ నిర్మాణ సంస్థలో ధనుష్(Dhanush) ఓ సినిమా అంగీకరించి దాదాపు సగం పైగా షూటింగ్ అయిపోయి ఇప్పుడు షూటింగ్ కి రావట్లేదని, అడిగినా సమాధానం ఇవ్వట్లేదని.. ఈ వివాదంలో ధనుష్ కి రెడ్ కార్డు ఇవ్వనున్నారు. ఇక మరో హీరో అధర్వ(Adharva) మదియలకన్ నిర్మాణ సంస్థలో ఒక సినిమా ఓకే చేసి ఆ షూటింగ్ కి సహరించట్లేదని నిర్మాత ఫిర్యాదుతో అతనికి కూడా రెడ్ కార్డు జారీ చేస్తారని సమాచారం.
దీంతో తమిళ నిర్మాతల మండలి నిర్ణయం సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది. రెడ్ కార్డు జారీ చేసి వారి సినిమాలపై బ్యాన్ విధిస్తారా, మరోసారి చర్చలు జరుపుతారా చూడాలి. అయితే స్టార్ హీరోలపై బ్యాన్ విధించగలరా, వారి సినిమాలు ఆపితే పరిశ్రమకే నష్టం వస్తుంది అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.