Mohanlal : ఆస్పత్రిలో చేరిన స్టార్ హీరో మోహన్‌లాల్.. ఏమైందంటే ?
మోహన్ లాల్‌ను చెక్ చేసిన డాక్టర్లు ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
- Author : Pasha
Date : 18-08-2024 - 3:59 IST
Published By : Hashtagu Telugu Desk
Mohanlal : ప్రముఖ నటుడు 64 ఏళ్ల మోహన్‌లాల్ అకస్మాత్తుగా కేరళలోని కొచ్చిలో ఉన్న అమృత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిలో చేరారు. తీవ్ర జ్వరం, కండరాల నొప్పి, శ్వాస తీసుకోవడంలో అసౌకర్యంగా ఉండటంతో ఆయన ఆస్పత్రికి వెళ్లారు. మోహన్ లాల్‌ను చెక్ చేసిన డాక్టర్లు ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అంతకుముందు ఆయన ఆస్పత్రిలో చేరారనే వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనకు లోనయ్యారు. మోహన్ లాల్(Mohanlal) త్వరగా కోలుకోవాలని భగవంతుడికి ప్రార్థనలు చేశారు. ఈనేపథ్యంలో సదరు ఆస్పత్రి ఎక్స్ వేదికగా ఓ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, స్వల్ప ఆరోగ్య సమస్యల వల్ల చెకింగ్ కోసం వచ్చారని స్పష్టం చేసింది. ఐదు రోజుల పాటు ప్రజలకు దూరంగా మందులు వాడుతూ విశ్రాంతి తీసుకోవాలని సూచించామని అమృత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రి వైద్యుడు గిరీశ్ కుమార్ వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join
మోహన్ లాల్ దర్శకుడిగా కూడా మారారు. ఆయన డైరెక్షన్‌లో రూపుదిద్దుకున్న ‘బరోజ్’ సినిమా గాంధీ జయంతి రోజున (అక్టోబర్ 2) విడుదల కానుంది. ఆ తర్వాత ‘లూసిఫర్’ సీక్వెల్ ‘ఎల్ 2: ఎంపురన్’ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. విష్ణు మంచు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ సినిమాలో ఓ కీలక పాత్రలో అతిథిలా మోహన్ లాల్ సందడి చేయనున్నారు.
Also Read :Bigg Boss : బిగ్‌బాస్ సీజన్ 8లోకి ఆ టాలీవుడ్ హీరో ఎంట్రీ ?
కేరళలోని వయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన దాదాపు 300 మందికిపైగా ప్రజలు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతానికి ఇటీవలే మోహన్ లాల్ వెళ్లారు. బాధిత కుటుంబాల వారితో ఆప్యాయంగా మాట్లాడి, వారి బాధను అడిగి తెలుసుకున్నారు. బాధితులను ఆదుకునేందుకు రూ.3 కోట్ల ఆర్థికసాయాన్ని ఆయన ప్రకటించారు. ఈక్రమంలో వయనాడ్ పరిధిలోని మెప్పాడిలో ఉన్న ఆర్మీ క్యాంపు వద్దకు చేరుకున్న మోహన్ లాల్, అధికారులతో కొద్దిసేపు చర్చించారు. కొండచరియలు విరిగిపడి అతలాకుతలమైన చూరల్ మల, ముందక్కై, పుంఛిరి మట్టం ప్రాంతాలను సందర్శించి ప్రజలను పరామర్శించారు.